కాకినాడ డీఎఫ్‌వోగా మూడు రోజుల కిందటే వెళ్లిన రవీంధ్రనాథ్ రెడ్డి అనే అధికారికి అప్పుడే ఊస్టింగ్ ఆర్డర్స్ రెడీ అయిపోయాయి. దీనికి కారణం తనను కాకినాడ జిల్లా డీఎఫ్‌వోగా నియమించారంటే ఆషామాషీ కాదని..తాను పవన్ కల్యాణ్ మనిషినని.. ఆయన పేషీలో అధికారులంతా తాను చెప్పినట్లుగా చేస్తారని ప్రచారం చేసుకోవడమే కాదు.. ఆ పేరుతో ఇతర మైనింగ్, అటవీ శాఖ అధికారుల్ని బెదిరించడం ప్రారంభించారు. ఈ బెదిరింపులు అన్నీ ఎందుకంటే.. నెలవారీ మామూళ్లు టార్గెట్ గా పెట్టడానికి.
కొత్త డీఎఫ్‌వో నిజంగానే పవన్ కు దగ్గరా లేకపోతే ఆయన గత ఐదేళ్లలో అలవాటుపడిన అవినీతిని కొనసాగించడానికా అని కొంత మంది ఆరా తీశారు. ఆయన పెద్ద ఫ్రాడ్ అని.. అక్కడ పోస్టింగ్ తచ్చుకోవడానికి పవన్ కు సంబంధం లేదని తేలింది. కాకినాడ డీఎఫ్‌వోగా ఎలా వచ్చారో కానీ పవన్ పేరుతో మైనింగ్ సహా అన్నీ వ్యవహారాలు చక్కబెట్టేద్దామనుకున్నారు . సీన్ రివర్స్ అయిపోయింది. అందరూ కలిసి అతని బాగోతాన్ని డిప్యూటీ సీఎం పేషీకి తెలియచేశారు.
విషయం తెలియడంతో పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. కాకినాడ డీఎఫ్‌వో రవీంద్రనాథ్‌రెడ్డిపై విచారణకు ఆదేశించారు. తన పేరు, కార్యాలయం పేరుతో అవినీతికి పాల్పడితే చర్యలు తీసురోవాలని వెంటనే విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తయిందని దసరా పండుగ పూర్తయిన తర్వాత ఆయనపై సస్పెన్షన్ లేదా బదిలీ వేటు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. తన పేరును ఎవరు వాడుకున్నా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పవన్ నేరుగా ఆదేశాలు జారీ చేశారు.