తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ఎక్కువ మంది హీరోలు….. నా అభిమానులు, నా ఫ్యాన్స్ అని చెప్పి అభిమానులను సంబోధిస్తూ ఉండే టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త కొత్తగా ట్రై చేశాడు. నాకు అభిమానులు అని పిలవడం నచ్చదు, వాళ్ళు నా ఆత్మీయులు అని చెప్పాడు. ఈ పిలుపు విషయంలో పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా గర్వంగా ఫీలవుతూ ఉంటారు. అభిమానులు అనడం కంటే కూడా ఆత్మీయులు అని చెప్పి ఫ్యాన్స్‌ని పిలవడం అంటే అది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. సేం టు సేం అదే స్టైల్లో చేనేతలను కూడా కొత్తగా పిలవాలని పిలుపునిచ్చాడు పవన్. చేనేత కార్మికులు అని పిలవొద్దని, చేనేత కళకారులు అని పిలవాలని చెప్పుకొచ్చాడు. నేతన్నలను చేనేత కళాకారులు అని కూడా చాలా మంది పిలుస్తూనే ఉంటారు. చేనేత కార్మికులు అని కూడా అంటూ ఉంటారు. నిజానికి ఆ రెండు పదాల్లోనూ ఎక్కువా తక్కువలేమీ లేవు. కార్మికుడు అనే పదం కూడా ఎందులోనూ తక్కువ కాదు. కానీ పవర్ స్టార్‌కి మాత్రం చేనేత కార్మికుడు అంటే ఎందుకో కాస్త తక్కువగా అనిపించినట్టుగా ఉంది. తాతల కాలం నుంచి మా వాళ్ళందరిదీ కమ్యూనిస్టు భావజాలమే అని చెప్తూ ఉంటాడు పవన్. చిన్నప్పటి నుంచీ క్లాస్ పుస్తకాల కంటే కూడా కమ్యూనిస్ట్ భావజాలానికి సంబంధించిన పుస్తకాలే ఎక్కువగా చదివానని కూడా పవనే చెప్పుకుంటూ ఉంటాడు. మరి అలాంటి పవన్‌కి కార్మికుడు అనే పదం ఎందుకు తక్కువగా అనిపించిందో ఆయనే చెప్పాలి. అయినా అభివృద్ధి చెందాలంటే దేశం నుంచి విడిపోవాలి, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అని డిమాండ్స్ వినిపించినట్టుగా చేనేత కార్మికులను కళాకారులు అని పిలిచినంత మాత్రాన వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందా? లక్షల, వేల కోట్లకు పడగలెత్తిన పారిశ్రామిక వేత్తలకు ఎన్నో రాయితీలిస్తామని చెప్పి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని బ్రతిమాలుకునే మన పాలకులు….కోట్లాది మందికి ఉపాధిని కల్పిస్తున్న వ్యవసాయానికి, మన సంస్కృతిలో భాగమైన వృత్తి పనివారికి రాయితీలివ్వడానికి మాత్రం గింజుకుంటారు. బిచ్చంతో సరిపెట్టాలని చూస్తూ ఉంటారు. మా వళ్ళనే సాఫ్ట్వేర్ అభివృద్ధి చెందింది అని గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడే పాలకులు…..వాళ్ళ వళ్ళనే వ్యవసాయం చచ్చిపోతోంది, చేతివృత్తులు నాశనమవుతున్నాయి, పల్లెసీమలు ఖాళీ అవుతున్నాయి అన్న కఠిన నిజాలను ఒప్పుకోవడానికి మాత్రం ఇష్టపడరు. ఈ పేర్ల మార్పిడి వ్యవహారం కంటే కూడా మన పేరు గొప్ప పాలకుల ఆలోచనల్లోనూ, విధానాల్లోనూ మార్పు తెచ్చే దిశగా పవన్ పోరాటం ఉంటే కాస్తయినా ప్రజలకు మంచి జరుగుతుందేమో.