మత్స్యకారుల కోసం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. మత్స్యకార అభ్యున్నతి సభను నర్సాపురంలో ఆదివారం ఏర్పాటు చేశారు. దీనికి పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపల చెరువులపై మత్స్యకారులకు అధికారాలు తొలగించేలా ..వారి ఉపాధిని దెబ్బతీసేలా ఉన్న జీవో 217ను విడుదల చేసింది. దానికి వ్యతిరేకంగా జనసేన ఉద్యమం చేస్తోంది. ఇప్పటికే మత్స్యకార గ్రామాల్లో అభ్యున్నతి యాత్ర పూర్తి చేశారు. ఆదివారం సభ నిర్వహిస్తున్నారు.
ఉదయం పదకొండు గంటలకు రాజమండ్రి చేరుకునే పవన్ కల్యాణ్ పట్టణంలోని ఇసుక ర్యాంపు నుంచి రోడ్ షో చేసుకుంటూ సభా ప్రాంగణం జరిగే వీవర్స్కాలనీ వద్దకు చేరుకుంటారు. మత్స్యకార అభ్యున్నతి సభలో మూడు గంటలకు ప్రసంగిస్తారు. తిరిగి రాజమండ్రి వెళ్లి రాత్రికి హైదరాబాద్ వెళ్తారు. నిజానికి గత నవంబర్లో ప్రపంచ మత్స్యకార దినోత్సవం రోజునే దీన్ని నిర్వహించాలని అనుకున్నారు. కానీ అప్పుడు వర్షాల కారణంగా వాయిదా పడింది.
మత్స్యకార సొసైటీల పేరుతో అన్నీ దళారుల చేతుల్లో ఉన్నాయని అందుకే జీవో తీసుకొచ్చి వేలం వేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 217ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కూడా మత్స్యకారులకు భరోసా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే మత్స్యకారులు ఈ జీవోపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మత్స్యకారులకు మద్దతు పలికి పవన్ కల్యాణ్ వారిని జనసేనకు దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.