జనసేన లెటర్ ప్యాడ్ మీద, పవన్ కళ్యాణ్ సంతకంతో సోషల్ మీడియాలో వచ్చిన ఒక ప్రకటన జనసేన అభిమానుల లో గందరగోళం సృష్టించింది. విజయవాడ సెంట్రల్ శాసనసభ అభ్యర్థి గా కోగంటి సత్యం, తూర్పు శాసనసభ అభ్యర్థిగా పోతిన మహేష్, పశ్చిమ శాసనసభ అభ్యర్థిగా కొరడా విజయ్ కుమార్ గారిని ఖరారు చేయడం జరిగింది అంటూ పవన్ కళ్యాణ్ సంతకంతో వచ్చిన జనసేన లెటర్ ప్యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చాలామంది జనసేన అభిమానులు కూడా అభ్యర్థుల ఎంపిక ఈ మూడు స్థానాలకు ఖరారయింది ఏమో అని అనుకున్నారు. అయితే తరువాత తెలిసిన అంశమేమిటంటే ఇది ఎవరో సృష్టించిన నకిలీ లేఖ అని. దాంతో ఇదే సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ ఖండన ప్రకటనను విడుదల చేసింది.
విజయవాడ నగర పరిధిలోని నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వచ్చిన ప్రెస్ నోట్ నిజం కాదు, పార్టీ ఎవరిని కూడా అభ్యర్థులుగా ఖరారు చేయలేదు, జనసేన పార్టీకి సంబంధించిన వివరాలు ఏవైనా సరే పార్టీ విడుదల చేస్తుంది, దయచేసి జనసైనికులు, ప్రజలు గమనించగలరు. pic.twitter.com/h0hIGwdp2t
— JanaSena Shatagni (@JSPShatagniTeam) January 5, 2019
జనసేన పార్టీ సోషల్ మీడియా వింగ్ జనసేన శతృఘ్ని ప్రకటన విడుదల చేస్తూ, “విజయవాడ నగర పరిధిలోని నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వచ్చిన ప్రెస్ నోట్ నిజం కాదు, పార్టీ ఎవరిని కూడా అభ్యర్థులుగా ఖరారు చేయలేదు, జనసేన పార్టీకి సంబంధించిన వివరాలు ఏవైనా సరే పార్టీ విడుదల చేస్తుంది, దయచేసి జనసైనికులు, ప్రజలు గమనించగలరు” అని పేర్కొంది.
అయితే సోషల్ మీడియా ఆధారంగానే ఎక్కువగా ప్రచారాన్ని ప్రకటనలను విడుదల చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నకిలీ లెటర్ పై సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఫోర్జరీ కేసు ఫైల్ చేయాల్సిందిగా జనసేన లీగల్ వింగ్ కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.