ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం పెట్టారు. పవన్ చిన్న కుమార్తె పలీనా అంజని తిరుమల దర్శనానికి రావడంతో..టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై వారిద్దరూ సంతకాలు చేశారు.
పలీనా అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేయాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ తన కూతురును తిరుమల దర్శనానికి తీసుకొచ్చి డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేయించడం పట్ల రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల జగన్ తిరుమల పర్యటనపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. క్రిస్టియన్ మతానికి చెందిన జగన్ తిరుమల డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిందేనని డిమాండ్ లు వచ్చాయి.
హిందూ ధార్మిక సంఘాలు, సంస్థలు ఆందోళనకు దిగాయి. జగన్ ఇంటిని సైతం ముట్టడించాయి. దీంతో జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ వివాదంపై రచ్చ కొనసాగుతున్న వేళ పవన్ తన కూతురితో డిక్లరేషన్ పై సంతకం చేయించడం ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టులో తిరుమల లడ్డూపై విచారణ నేపథ్యంలో కోర్టు వ్యాఖ్యలతో వైసీపీ స్పీడ్ పెంచింది.
ఈ క్రమంలోనే తన కూతురితో డిక్లరేషన్‌పై సంతకం చేయించడం, తండ్రిగా పవన్ కళ్యాణ్ సంతకం చేయడం వైసీపీకి చెక్ పెట్టేందుకేననే వాదనలూ వినిపిస్తున్నాయి.