జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గత కొద్ది రోజులుగా.. “నాకే కానీ పది ఎమ్మెల్యే సీట్లు ఉంటే అసెంబ్లీని స్తంభింపచేసేవాడిని” అంటున్నారు. ఇదొక్కటే కాదు.. ఇంకా “నేనే గనుక పోటీ చేసి ఉంటే.. పది అసెంబ్లీ సీట్లలో అయినా గెలిచేవాడిని”. “నేనే గనుక పోటీ చేసి ఉంటే కేంద్రమంత్రిని అయి ఉండేవావాడిని”. “నేనే గనుక మద్దతు ఇవ్వకపోతే.. తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ఉండేది..”.. ఈ డైలాగులన్నీ కూడా ఆయనవే. పవన్ కల్యాణ్ చెప్పుకోవడం ఎలా ఉందంటే… పది మార్కుల తేడాతో పరీక్షను కోల్పోయిన విద్యార్థి.. ఆ పది మార్కులు వచ్చి ఉంటే.. నేను సులువుగా ఐఏఎస్ అయ్యేవాడినని చెప్పుకున్నట్లే ఉంటుంది. ఎందుకంటే.. అలా అనుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఊహించుకుని సంతృప్తి పడటానికి తప్ప.
పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాల ద్వారా కావొచ్చు..మరో కారణం ద్వారా కావొచచు.. అవన్నీ జరిగిపోయాయి. అలా చెప్పుకోవడం వల్ల పవన్ పోటీ చేసి ఉంటే ఫలానా స్థానాల్లో గెలిచి ఉండేవారని గుర్తించి..ఆయా పార్టీల ఎమ్మెల్యేలందరూ పవన్ కల్యాణ్ దగ్గరకు రారు. కానీ పవన్ అలాంటి ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. పది ఎమ్మెల్యే సీట్లు ఎలాగూ లేవు… మరి ఇప్పుడు… దాని గురించి ఎందుకు..? పవన్ కల్యాణ్.. తాను అది చేసే వాడిని.. ఇది చేసేవాడిని అని చెప్పుకోవడం కాకుండా.. కనీసం తను ఇప్పుడు చేస్తున్న పోరాటంలో అయినా ఆ పట్టుదల చూపించాలి కదా..! రాజకీయాల్లో అంతా నా ఇష్టం అంటే.. ప్రజలకు కూడా అదే అనుకుంటారు.
పవన్ కల్యాణ్.. గొప్ప గొప్ప ఆదర్శాలు చెబుతూంటారు. వాటిలో ఒక్కటి కూడా ఆయన వ్యక్తిగత జీవితంలో కానీ.. రాజకీయ జీవితంలో కానీ… ఆచరించినట్లు కనిపించరు. అలా చెప్పే వాటిల్లో సంకల్పం అనే పదం కడా తరచూ వస్తుంది. సంకల్పం ఉంటే విజయం అదే వస్తుందని. ఈ సంకల్పం.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో దొరికేది కాదుగా..! తనంతట తాను తెచ్చుకోవాలి.. అనుకున్న విధంగా రాజకీయాలు చేయాలనుకోవాలి. .. చేయాలి. కానీ గుర్తున్నప్పుడే పోరాటం చేస్తా.. మిగతా సమయాల్లో కార్యకర్తల సమావేశాల్లో … సినిమా డైలాగులతో కూడిన ప్రసంగాలు చేస్తామంటే సాధ్యం కాదుగా..!
ఎన్నికలు ఇప్పుడు ఎంతో దూరంలో లేవు.. మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు ముచుకొస్తాయి. ఇప్పటి వరకూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రమే.. పర్యటన పూర్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటూ.. ఆరు నెలలలో ఇడుపుల పాయ నుంచి కృష్ణా జిల్లా వరకూ వచ్చారు. కానీ పవన్ కల్యాణ్ మూడు నెలల్లో బస్సు యాత్ర ద్వారా ఉత్తరాంధ్రను పూర్తి చేయలేకపోయారు. సంకల్పం అంటే ఇది కాదుగా. రాజకీయాలను పవన్ ఇంతే సీరియస్‌గా తీసుకుంటే.. పది మంది ఎమ్మెల్యేలు కాదు..యాభై మందిని ఇచ్చినా ఏమీ చేయలేరు. అది అందరికీ తెలుసు. అందుకే పవన్ జరిగిపోయిన విషయాన్ని చూపించి.. అలా జరిగి ఉంటే. నేను ఏదో పొడిచేవాళ్లని చెప్పుకోవడం కాకుండా… చేయాల్సిన పోరాటాలపై దృష్టి పెడితే బాగుంటుందేమో..?
— సుభాష్