జనసేన అధినేత పవన్ కల్యాణ్ పయనం ఎటువైపు..? టీడీపీ, బీజేపీ, వైపీసీ.. ఈ మూడు పార్టీల్లో ఇదే ప్రశ్నపై తీవ్రమైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి. టీడీపీ నుంచి కొంత స్పష్టత ఉందనే చెప్పాలి. ఆంధ్రాలో రాజకీయ అనిశ్చితి కోసం భాజపా ఆడిస్తున్న ఆటలో భాగమే పవన్ తిరుగుబాటు అన్నట్టుగా వారు చూస్తున్నారు. నాలుగేళ్లలో ఏమీ మాట్లాడని జనసేనాని, ఇవాళ్ల టీడీపీ పాలనలో అవినీతి అంటూ ప్రశ్నించడం సమంజసమా అనేది టీడీపీ వాదన. సంక్షోభాలు తనకు కొత్త కాదనీ, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మారిన పవన్ వైఖరిపై టీడీపీలో వ్యక్తమౌతున్న స్పష్టత ఇది. పవన్ ని దారికి తెచ్చుకునే ప్రయత్నమో, గతంలో మాదిరిగా పవన్ వ్యాఖ్యలపై విమర్శలొద్దు అనే అప్రకటిత ఆదేశాల్లాంటివి ఇప్పుడు టీడీపీ అధినాయకత్వం నుంచి వెలువడటం లేదనేది చాలా స్పష్టంగా ఉంది.
ఇక, విపక్ష పార్టీ వైకాపా విషయానికి వస్తే… నిన్నటివరకూ చంద్రబాబు దర్శకత్వంలో పవన్ నటిస్తున్నాడు అంటూ విమర్శించిన నేతలకు, ఇవాళ్ల జనసేనాని ప్రీతిపాత్రుడిగా మారిపోయారు..! చంద్రబాబును విమర్శించేవాళ్లంతా తమ స్నేహితులే అనేది ధోరణిలో వైకాపా ఉంది. తాను తెలుగుదేశంతో లేనని పవన్ చెప్పారనీ, ఎన్నికలు అయ్యాక తమకే మద్దతు ఇస్తారన్నారని వైకాపా ఎంపీ వరప్రసాద్ వ్యాఖ్యానించారు. పవన్ ప్రశ్నించిన అంశాలన్నీ గతంలో మేం చెప్పినవే అంటూ అంబటి రాంబాబు మాట్లాడారు. పవన్ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎన్నికల నాటికి పవన్ తమతో కలుస్తారేమో అనే ఊగిసలాటలో ఆ పార్టీ ఉంది. అందుకే, అసెంబ్లీకి జగన్ రావడం లేదని పవన్ విమర్శించినా… ఆ అంశాన్ని ఖండించే ప్రయత్నం ఇప్పుడు వైకాపా చేయడం లేదు..!
ఇక, భాజపా విషయానికొస్తే… చంద్రబాబుపై పవన్ విమర్శలు చేశాక భాజపా నేతల్లో ఉత్సాహం పెరిగిందట! పవన్ వెనకే కాదు, ఆయనతోనే భాజపా ఉందని టీడీపీ నేతలతో ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. త్వరలోనే పవన్ తో భాజపా జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ భేటీ కాబోతున్నారట. ఏపీలో రాజకీయ లబ్ధి కోసం భాజపా కాచుకుని కూర్చుందని తెలిసిందే. కాబట్టి, పవన్ కి మద్దతుగా నిలిచినట్టు వ్యవహరిస్తే… ఎన్నికల్లో తమకు ప్లస్ అవుతుంది అనేది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. పైగా, మొన్నటి సభలో భాజపాని పవన్ విమర్శలేదు, దక్షిణాది – ఉత్తరాది కాన్సెప్ట్ మాట్లాడలేదు, భారత్ మాతా కీ జై అన్నారు… పవన్ వ్యాఖ్యల్లో భాజపా వెతుక్కుంటున్న సానుకూలతలు ఇవి.
ఇక, అసలు విషయానికొద్దాం… ఇంతకీ పవన్ కల్యాణ్ ఓ భారీ వ్యూహంతోనే టీడీపీపై విమర్శలు చేశారా..? అంటే, అంత వ్యూహాత్మకత జనసేనానికి ఉందా అనే మరో ప్రశ్నే సమాధానంగా కనిపిస్తోంది..! ఎందుకంటే, ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే… వ్యాఖ్యలు చేసినంత తీవ్రంగా వ్యవహార శైలి ఉండదనేది అర్థమౌతుంది. నిజంగా, అంత ప్రణాళికాబద్ధత ఉంటే… ఈపాటికి పార్టీని పక్కాగా నిర్మించుకునేవారు. ఎన్నికల సంఘం గుర్తింపు పొంది నాలుగేళ్లు అవుతున్నా… ఏ కార్యవర్గమూ కమిటీలు లేని, ఇన్నాళ్లలో ఎక్కడా పోటీకి దిగని ఏకైక రాజకీయ పార్టీగా జనసేన ఎందుకు ఇలా మిలిపోయి ఉంటుంది..? కాబట్టి, ఆ గందరగోళాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమైనా మరింత గందరగోళంగా పవన్ మాట్లాడి ఉండాలి, లేదంటే.. ఈ స్క్రీన్ ప్లే వెనక భాజపా రచనా సహకారమైనా ఉండాలి. అనూహ్యంగా మారిన పవన్ వైఖరి వెనక ఈ రెండింటిలో ఏదో ఒక కారణమై ఉండొచ్చు. అయితే, పవన్ కన్ఫ్యూజన్ ను సరిగా అర్థం చేసుకోలేని వైకాపా, భాజపాలు… తమ రాజకీయ అవసరాల కోసం పవన్ వెంట పాకులాడుతూ ఉండటం వారు పడుతున్న గందరగోళానికి చిహ్నంగా కనిపిస్తోంది.