తెలుగు మీడియా అంతా.. తెలంగాణ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించింది కానీ.. పవన్ కల్యాణ్.. కొద్ది రోజులుగా…తన రాజకీయ విధానాన్ని మార్చుకున్న వైనం స్పష్టంగా బయటపడుతోంది. ఆయన రెండు, మూడు రోజుల కిందట వరకూ.. పూర్తి స్థాయిలో చంద్రబాబును, లోకేష్‌ను టార్గెట్ చేసేవారు. ఇప్పుడా ప్లేస్‌లోకి… జగన్ వచ్చారు. జగన్ ను ఆయన మగతనం దగ్గర్నుంచి… చాలా చాలా మాటలు అంటున్నారు. ఈ విమర్శలకు ప్రాతిపదిక.. తనను వ్యక్తిగతంగా విమర్శించడం.. ఎమెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడం. ఇవేమీ కొత్తవి కాదు.. అయినా పవన్ కల్యాణ్.. కొత్తగా వాటిని గుర్తు తెచ్చుకుని విమర్శలు చేస్తున్నారు. వీటికి తోడు.. కొత్తగా.. ఏకంగా ముస్లింలతో జరిగిన సమావేశంలోనే.. బీజేపీకి మద్దతుగా మాట్లాడారు. బీజేపీతో స్నేహం ఏమిటని.. ప్రశ్నించిన వారికి… బీజేపీ మీరనుకుంటున్న టైప్ పార్టీ కాదంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయో.. ముస్లిం మైనార్టీల పట్ల ఆ పార్టీ వైఖరి ఎలా ఉంటుందో… దేశానికి కాదు.. ప్రపంచం మొత్తానికి తెలుసు. అసలు ముస్లింలు భారతీయులు కాదన్నది.. ఆ పార్టీ నమ్మకాల్లో ఒకటి. తమది మతతత్వ పార్టీ కాదని.. గట్టిగా వాదించుకోవడానికి బీజేపీ నేతలే సిగ్గపడతారు. అలాంటిది.. పవన్ కల్యాణ్ మాత్రం.. నేరుగా… బీజేపీకి.. సర్టిఫికెట్ ఇచ్చేశారు. భారతీయ జనతా పార్టీ… ఓ రాజకీయ పార్టీ మాత్రమేనని.. మతతత్వ పార్టీ కాదని తేల్చేశారు. ప్రత్యేకంగా కొంత మంది ముస్లింలను పిలిపించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలోనే పవన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో… ముస్లింలులు ఆశ్చర్యపోయారు. ఏపీ రాజకీయ వర్గాలు మరింతగా ఆశ్చర్యపోయాయి. నిన్నామొన్నటి వరకూ.. మోదీ , అమిత్ షాలు తన బాబాయ్లేమీ కాదన్నట్లు ప్రకటనలు చేసి.. ఇప్పుడు.. ఇలా ఒక్క సారిగా మా మంచి బీజేపీ అన్నట్లు మాట్లాడటానికి కారణం ఏమిటన్న సందేహాలు… జనసేనలో కూడా ప్రారంభమయ్యాయి.
నిజానికి భారతీయ జనతా పార్టీని.. కొన్నాళ్ల కిందట.. అత్యంత తీవ్రంగా విమర్శించిన వారిలో పవన్ కల్యాణ్ ఒకరు. గో రాజకీయాలు, బీఫ్ పాలిటిక్స్, ఉత్తరాది పార్టీ అని విమర్శించారు. కానీ ఇప్పుడు.. ఏపీ ప్రజలంతా.. బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సమయంలో .. ఆ పార్టీని వెనుకేసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి.. పవన్ కల్యాణ్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ డైరక్షన్ లో నడుస్తున్నారని.. రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలను చూపి… ఇరవై సీట్లు తెచ్చుకున్నా.. ముఖ్యమంత్రి పదవి వచ్చేలా చేస్తామని.. రామ్‌మాధవ్ పవన్‌కు హామీ ఇచ్చారని..అదుకే.. జనసేనాధినేత… అలా మారిపోయారని చెబుతున్నారు. ఇది నిజమో కాదో కానీ… బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మాత్రం… అత్యంత సానుకూలత చూపుతున్నారు. అది పొత్తుల వరకూ వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది.