పవన్ కల్యాణ్ కి సిగ్గు.. మొహమాటం. ప్రజా వేదికలపై ఉరకలెత్తే ఉత్సాహంతో మాట్లాడేస్తారు కానీ, కెమెరా ముందు నటించాలంటే బిడియం. డాన్సులంటే మరీనూ. “నాకొచ్చేవే రెండు మూడు స్టెప్పులు. వాటిని అటూ ఇటూగా మార్చి వేస్తుంటా“ అని బాహాటంగానే చెప్పారు. మరోసారి డాన్సులంటే తనకెంత భయమో, వేయాలంటే.. ఎంత సిగ్గుపడతారో.. అభిమానుల సాక్షిగా.. చెప్పుకొచ్చారు.
నాని కథానాయకుడిగా నటించిన చిత్రం.. అంటే – సుందరానికీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈరోజు శిల్పకళావేదికలో జరిగింది. ఈకార్యక్రమానికి పవన్ కల్యాణ్ అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా పవన్ ఏవీని ప్రదర్శించారు. చివర్లో పవన్ సిగ్నేచర్ స్టెప్పుల్ని వరుసగా చూపించారు. ఈ వీడియో చూస్తున్నంత సేపూ పవన్ నవ్వుతూనే ఉన్నారు. ఆ తరవాత వేదికపై మాట్లాడుతున్నప్పుడు “ఏవీలు వేయడం నాకు వ్యక్తిగతంగా ఇష్టం ఉండదు. కానీ… అభిమానుల కోసం తప్పదు. చివర్లో డాన్సులు చూస్తుంటే, అవన్నీ వేసింది నేనేనా అనిపించింది. నాకు డాన్సులు వేయడం పెద్దగా ఇష్టం ఉండదు. కానీ అభిమానులకు భయపడి స్టెప్పులేస్తుంటా. నాకైతే నడుచుకుంటూ వెళ్లిపోవడం ఇష్టం. నాతో పనిచేసే దర్శకులంతా నాతో స్టెప్పులేయించకండి.. నడుచుకుంటూ వెళ్లిపోయేలా డాన్సులు రూపొందించండి“ అని సరదాగా వ్యాఖ్యానించారు.
ఆ సందర్భంగా నాని నటనకు, తన కృషిని అభినందించారు. తన ఇంట్లో కూడా నాని ఫ్యాన్స్ ఉన్నారని గుర్తు చేసుకొన్నారు. సినిమా రంగంలో వివిధ పార్టీవాళ్లు ఉండచ్చని, భావజాలాలు వేరై ఉండొచ్చని, కానీ సినిమా పరిశ్రమ అంతా ఒక్కటేనని సినిమాల్నీ, రాజకీయాల్నీ ఒక్కటిగా చూడొద్దని ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యానించారు.