పవన్ కల్యాణ్ అమెరికా పర్యటనలో దుమ్ము దులిపేస్తున్నారు! వివిధ సమావేశాల్లో పాల్గొంటూ రాష్ట్రంలో పాలన తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. నిజానికి, అవేం కొత్త విషయాలు కావు. ఒక కాకినాడ సభ, అనంతపురం, అంతకుముందు తిరుపతి సభల్లో ఆయన చెప్పినవే. జనం విన్నవే! కాకపోతే… అమెరికా వెళ్లేసరికి అదే విషయం ఆంగ్లంలో చెబుతున్నారు. అయితే, ప్రభుత్వాల తీరుపైన ఆయన చేస్తున్న కొన్న విమర్శల్ని ఈ సందర్భంగా ప్రస్థావించాలి. పాలకులంతా అబద్ధాలు ఆడుతున్నారనీ, ఎన్నికల ముందు చెప్పిందొకటీ, ఇప్పుడు చేస్తున్నది మరొకటీ అని పవన్ అన్నారు. హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటి గురించి పట్టించుకోకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నట్టు చెప్పుకొచ్చారు. పాలకుల తీరు చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు!
ఇక్కడే.. అసలు విషయం పవన్ మరచిపోతున్నారు! ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్తే… ఎన్నికల సమయంలో తెలుగుదేశం, భాజపా కూటమి చాలా హామీలు ఇచ్చిన మాట వాస్తవమే. కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రా తలరాత మారిపోద్దనీ, రైతుల కష్టాలు తీరిపోతాయనీ, మహిళలకు మంచి రోజులు వచ్చేస్తాయనీ… ఓ రేంజిలో ఊదరగొట్టారు. ఆ కూటమికి పవన్ మద్దతు ఇచ్చారు. అంతేకాదు.. వారు ఇచ్చిన హామీలకు కూడా పవన్ సపోర్ట్ చేశారు. ఒకవేళ ఈ హామీలను భాజపా, దేశం సరిగా అమలు చేయకపోతే తాను ప్రశ్నిస్తాననీ, వాటిని అమలు చేయించే బాధ్యత తనది అన్నట్టు ప్రజలకు భరోసా ఇచ్చింది ఈ పవన్ కల్యాణే కదా!
మరీ, ఆ లెక్క ప్రకారం హామీలు అమలు కాకపోతే… భాజపా, తెలుగుదేశం పార్టీలను పవన్ ప్రశ్నించాలి. అంతేగానీ.. ఇలా సైడ్ అయిపోయి విమర్శిస్తే ఎలా..? ఆ హామీల అమలు బాధ్యత నుంచి తప్పుకుంటే ఎలా..? రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ, కాపుల రిజర్వేషన్లు… ఈ హామీలపై అధికార పార్టీని పవన్ నిలదీసిన సందర్భం ఏదీ..? ఇక, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పవన్ ఒత్తిడి పెంచుతున్న క్రమం ఏదీ..? కూటమి ఇచ్చిన హామీలకు నేనే పూచి అన్నారు కదా! ఆ మాట మరచిపోయి.. ఆ కూటమితో తనకేం సంబంధం లేనట్టూ, గతం గతః అన్నట్టూ, ఒక న్యూట్రల్ నాయకుడిగా పవన్ ఇప్పుడు విమర్శలు చేయడం ఎంతవరకూ కరెక్ట్… అనేది కొంతమంది ప్రశ్న.
ప్రశ్నించడం అంటే… ప్రశ్న వేసి వదిలేయడం కాదు. జవాబు రాబట్టడం! అప్పుడే ప్రశ్నకు ఒక విలువ ఉంటుందీ, ప్రశ్నించే నాయకుడిపైనా జనానికి ఒక నమ్మకం కలుగుతుంది. నాలుగు ప్రెస్ మీట్లు పెట్టి కేంద్రాన్ని ప్రశ్నించేశానూ, రాష్ట్రానికి క్వశ్చన్ పేపర్ పంపేశాను అనుకున్నంత మాత్రాన బాధ్యత తీరిపోయినట్టు కాదు కదా, ఏమంటారు..?