కుల , మతాలు లేని రాజకీయం రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. మంగళగిరిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరించిన తర్వాత మాట్లాడారు. ఈ సందర్భంగా కుల, మతాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్.. కాపు ఓట్లన్నింటినీ సమీకరించి.. మరొక పార్టీకి అమ్మేస్తారని జగన్ మాట్లాడారని మండిపడ్డారు. వైసీపీ నేతలు వాళ్ల భావాలను తమపై రుద్దడం సరికాదన్నారు. ఒక్క కులం చూసుకుని రాజకీయం చేసి ఉంటే జనసేనకు 40 సీట్లు వచ్చి ఉండేవన్నారు.
తాను సోషలిస్ట్ భావాలతో పెరిగిన వాడినని, కులాల గురించి తనకు అప్పట్లో తెలిసేది కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఒక కులాన్ని వర్గ శత్రువుగా భావించడం సరికాదని చెప్పానని, కులాలను ఆపాదించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. తనకు దగ్గరైన వ్యక్తి ఆనంద్ సాయి అని, యాదాద్రికి ఆర్కిటెక్ట్‌గా ఉన్నపుడే అతను బీసీ అని తెలిసిందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం స్ఫూర్తితో జనసేనను స్థాపించామన్నారు. ఒక మసీదు, ఒక చర్చికి అపవిత్రం జరిగితే మనం బలంగా ఏ విధంగా ఖండిస్తామో.. దేవాలయాలకు అలాంటి పరిస్థితి వస్తే అంతే బలంగా ఖండిస్తామని.. అదే సెక్యులరిజమని స్పష్టం చేశారు.
వైజాగ్‌లో పరిశ్రమల కాలుష్యం కానీ.. ఆక్వా వల్ల నీరు, భూమి కాలుష్యం ఆయిపోయింది.. వీటిని కాపాడటమే జనసేన బాధ్యతని ప్రకటించారు. ఓట్లు వస్తయో లేదో తెలియదు కానీ వాస్తవాలు మాత్రమే తాను మాట్లాడతానన్నారు. మతాల ప్రస్తావనలేని రాజకీయం జనసేన లక్ష్యమని, రామతీర్థం ఘటనలో ఖండిచాం తప్ప.. రెచ్చ గొట్టలేదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం మత ప్రస్తావన తీసుకొచ్చే వారిని, తప్పులు చేసే వారిని జన సైనికులు, నేతలు ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.