జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరిగిన ఓ సమావేశంలో ఆవేశంగా మాట్లాడారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం కంటే ముందుగానే జనసేనకు కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ రూపంలో పునాదులు పడ్డాయని పవన్ చెప్పారు. చిరంజీవి స్థాయి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే పెనుమార్పులు వస్తాయన్న కారణంతో అప్పట్లో పాలక వర్గాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయన్నారు. ఆయన వస్తే ఏదైనా చేసేస్తారనే భయంతో కుటుంబంపై దాడి చేయడం మొదలుపెట్టారన్నారు. అప్పుడు తనకు కోపం వచ్చిందనీ, ఆ స్థాయి వ్యక్తి మీదే ఇలా దాడులు జరిగితే సామాన్యుడు ఎలా బతుకుతాడనే ఆవేదన కలిగిందన్నారు.
వీడికి ఉన్న కోపంతో తీవ్రవాద ఉద్యమాలకు వెళ్లిపోతాడన్న భయంతో అన్నయ్య తనకో రివాల్వర్ కొనిచ్చారని పవన్ చెప్పారు. తన జీవితంలో మొట్టమొదట తుపాకీతో ప్రేమలో పడ్డానని పవన్ అన్నారు. అయితే, అన్నయ్య కుటుంబంపై దాడి జరిగేసరికి, ఒక సామాజిక న్యాయానికి ప్రయత్నిస్తున్న వారిపైనే ఇలాంటివి జరుగుతుంటే రగిలిపోయాననీ, అందుకే కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టానన్నారు. ఆరోజున తాను అందరికీ అర్థం కాకపోయి ఉండొచ్చనీ, చాలా కొద్దిమంది మేధావులకు మాత్రమే తాను అర్థమయ్యానని పవన్ చెప్పుకొచ్చారు! జనసైనికులు అర్థం చేసుకున్నారన్నారు.
ఆ తరువాత, చుట్టుపక్కల ఉన్నవారంతా ఆ పార్టీకి కులం అంటగట్టారన్నారు. అందరి క్షేమం కోరి ఒక వ్యక్తి వస్తే కులం పేరు చెప్పి, ప్రాంతం పేరు చెప్పి లేనిపోనివి ఆపాదించే ప్రయత్నం చేశారన్నారు. తన విషయంలో కూడా కొందరు ఇలాంటి ప్రయత్నమే చేయబోతే కాళ్లు విరగ్గొడతా అని వార్నింగ్ ఇచ్చానన్నారు. ‘మీరు పార్టీలు పెడితే కులాలు రావా, మేం పార్టీలు పెడితే కులాలు వస్తాయా..? ఏం న్యాయం ఇది..?’ అంటూ ఆవేశంగా పవన్ స్పందించారు. 2014లో టీడీపీ వారే తన దగ్గరకు వచ్చారనీ, సపోర్టు చేయమంటే చేశాననీ, తాను స్వయంగా వెళ్లి మద్దతు ఇవ్వలేదు కదా అని పవన్ చెప్పుకొచ్చారు.
ప్రజారాజ్యం పార్టీ పెట్టి, భారీ రాజకీయ మార్పులకు చిరంజీవి శ్రీకారం చుట్టి ఉండొచ్చు. కానీ, ఎన్నికల తరువాత అదే లక్ష్యంతో ఆయన కొనసాగలేదే..! కాంగ్రెస్ లో విలీనం చేసేశారు కదా! మరి, ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఏం చేసినట్టు అనుమానం ఇలాంటి మాటలు విన్నాక కలుగుతుంది. ఆరోజే చిరంజీవి మద్దతుగా నిలిచి, ప్రజారాజ్యంలో తానూ ఒక మూలస్తంభాన్ని అనే స్థాయి భరోసా ప్రజలకు ఎందుకు కల్పించలేకపోయారు…? అదే చేసి ఉంటే ఇవాళ్ల కొత్తగా జనసేన అంటూ పార్టీ ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదు కదా! చిరంజీవిదీ, పవన్ కల్యాణ్ దీ ఒకే లక్ష్యమైతే.. రెండు పార్టీలు స్థాపించాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న కూడా ఇలాంటి ప్రసంగాలు విన్నాక కలుగతుంది కదా! ఇక, కులం ముద్ర విషయానికొస్తే.. ఆంధ్రాలో కులం ముద్ర లేని పార్టీ ఏది..? అందరూ ఆ తానులో ముక్కలే. కాబట్టి, అదేదో కొత్తగా జనసేనకు పడుతున్న ముద్రగా చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే, అన్ని కులాలవారికీ ఇస్తున్న ప్రాధాన్యతను బట్టీ ఆయా పార్టీల మనుగడ ఆధారపడి ఉంటుంది.