కనీసం ఓ పాతికేళ్ల ప్రయాణం కోసం రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటారు. ఢిల్లీలో జరిగిన ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంటులో పాల్గొన్న పవన్… యువతను ఆకర్షించేలా ప్రసగించారు. గెలుపు ఓటములు లెక్క చేయకుండా ఒక మార్పు కోసం జనసేన పార్టీని నడిపిస్తున్నా అని చెప్పారు. మార్పు వెనువెంటనే రావాలని ఈతరం కోరుకుంటోందనీ, ఇన్ స్టంట్ నూడుల్స్ మాదిరిగా అన్నీ రెండే నిమిషాల్లో జరిగిపోవాలని అనుకుంటారన్నారు. 2007లో ఇలాంటి ధోరణి యువత చూశాననీ, అక్కడ్నుంచీ ప్రజల్లో ఉంటూ 2014లో పార్టీ పెట్టాననీ, గత ఎన్నికల్లో ఓడిపోయా అన్నారు.
వ్యక్తిగత గుర్తింపు కోసం పార్టీ పెట్టలేదనీ, ఓడిపోయానన్న ఇగో తనకు లేదనీ, మాతృదేశం కోసం ఎంతో కొంత చెయ్యాలన్న సత్సంకల్పం ఉంటే ఈ గెలుపు ఓటములు ఏవీ ఎవ్వర్నీ ఆపలేవన్నారు పవన్. 23 ఏళ్ల వయసులో కుర్రాళ్లు పార్టీలు, పబ్ లకు వెళ్తుంటారనీ, కానీ ఆ వయసులోనే దేశం కోసం భగత్ సింగ్ ప్రాణత్యాగం చేశారనీ, ఆయనలాంటి వారే స్ఫూర్తి అన్నారు. కర్నూలు విద్యార్థిని కేసును ప్రస్థావిస్తూ… 2015లో ఘటన జరిగితే, ఆమె అత్యంత దారుణమైన పరిస్థితుల్లో చనిపోయిందని ఆధారాలున్నా కూడా అప్పటి ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం న్యాయం చెయ్యలేకపోయిందనీ, కానీ తాను ఈ మధ్యనే కర్నూలులో భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేసేసరికి సీబీఐ ఎంక్వయిరీ వేశారన్నారు. న్యాయం కోసం పోరాడాలనుకుంటే పదవులు హోదాలు అక్కర్లేదని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలన్నారు. ఇలాంటి నిస్సహాయులకు సాయం చెయ్యాలన్న సంకల్పంతో తాను ముందుకు సాగుతాననీ, దాని కోసం ఎన్నిసార్లు ఎన్నికల్లో ఓడిపోయినా లెక్కలేదన్నారు.
రాజకీయాల ద్వారా మార్పు సాధించాలనుకుంటే కనీసం పదేళ్ల నుంచి ఇరవయ్యేళ్ల సమయం పడుతుందన్నారు. దానికి సిద్ధమయ్యే తాను వచ్చానన్నారు. తన వంతుగా చిన్న మార్పు వచ్చినా చాలన్నారు. ఆ లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నా అన్నారు పవన్.
నిజానికి, ఇవన్నీ పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు చెబుతున్నవే. మనం కూడా చాలాసార్లు విన్న మాటలే. అయితే, తొలిసారిగా ఢిల్లీ స్థాయిలో తన విజన్, ఆలోచన ధోరణిని తెలియజెప్పే ప్రయత్నం ఈ సదస్సు ద్వారా చేశారు. పవన్ మాట్లాడుతున్నంతసేపు చాలాసార్లు కరతాళ ధ్వనులతో ఆడిటోరియం మారుమోగింది. మార్పు కోరుకోవాలనీ, అయితే ఆ మార్పు వెంటనే రాదనీ, కష్టపడాలనే సందేశాన్ని మరోసారి పవన్ ఇచ్చారు.