”జగన్ 80 మంది ఎమ్మెల్యేలను మారుస్తున్నారని వింటున్నాం. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. జగన్ను. మార్పు తీసుకొస్తున్నాం.. జగన్ను ఇంటికి పంపించేస్తున్నాం” అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజవకర్గం పోలిపల్లిలో నిర్వహించిన ‘యువగళం-నవశకం’ సభలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి జగన్ తీరు, వైసిపీ ప్రభుత్వ వైఫల్యాలని తనదైన శైలిలో ఎండగట్టారు.
ముందుగా.. జగన్, లోకేష్ పాదయాత్రలకు తేడా చెప్పారు పవన్. యువగళం పాదయాత్ర.. జగన్ మాదిరిగా బుగ్గలు నిమిరే యాత్ర కాదు. ప్రజల బాధలు తెలుసుకున్న పాదయాత్ర అంటూ జగన్ కు చురకలటించారు.
అనంతరం చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం గల గొప్ప వ్యక్తిని జైల్లో పెట్టడం చాలా బాధ కలిగించింది.జగన్ చేసిన తప్పులకు సోనియాగాంధీ.. అతన్ని జైల్లో పెట్టించారు. ఆ కక్షతో చంద్రబాబును జైల్లో పెట్టించడం దారుణం” అని మండిపడ్డారు పవన్.
టీడీపీ పొత్తు గురించి మాటాడుతూ.. తెలుగుదేశం-జనసేన స్నేహం చాలా కాలం కాపాడుకోవాలి. భవిష్యత్తులో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తాం” అని తెలిపారు పవన్ కళ్యాణ్.