పవన్ కల్యాణ్ ఎప్పుడూ రికార్డుల గురించి ఆలోచించడు. మాట్లాడడు. అయితే తొలిసారి పవన్ నోటి నుంచి రికార్డుల మాట వినిపించింది. అదీ.. సైరా ప్రీ రిలీజ్ వేడుకలో. ఖైదీ సినిమా బాగా ఆడి, రికార్డులు సాధించినప్పుడు ఓ తమ్ముడిగా తాను చాలా సంతోషించానని, అయితే ఆ తరవాత వచ్చిన ఎన్టీఆర్ చిత్రం ఆ రికార్డులు బద్దలు కొట్టిందని, అనుభవం ముందు ఏ రికార్డులూ పనిచేయవని అప్పుడు అనిపించిందని పాత రోజుల్లోకి వెళ్లారు పవన్. ఇప్పుడు కొత్తతరం హీరోలు ఎంతమంది వచ్చినా, ఎన్ని రికార్డులు కొట్టినా, తన అన్నయ్య అనుభవం తీసుకెళ్లలేరని ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. పరిశ్రమలో పోటీ ఎక్కువని, అయినా ఎవరు విజయం సాధించినా తమ కుటుంబం ఆస్వాదిస్తుందని, రాజమౌళి రికార్డులు సృష్టించినప్పుడు ఆనందపడ్డామని, ఆ రికార్డులు ఎవరు బద్దలు కొట్టినా సంతోషిస్తామని, ఎందుకంటే తమదంతా ఒకటే జాతి అని.. చెప్పుకొచ్చారు పవన్. శుభలేఖలో ఓ డైలాగ్‌కి డబ్బింగ్ చెప్పాల్సివచ్చిందని, మళ్లీ ఇంతకాలానికి అన్నయ్య సినిమాకి తన గొంతు ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని, జాతీయ గీతం గొప్పదనం చెబుతూ కొన్ని సంభాషణలు పలికానని పవన్ అన్నారు.