పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి చేరిపోయాక `సినిమాలకు దూరం` అంటూనే వచ్చాడు. తన తొలి ప్రాధాన్యం సమాజం కోసమే అని అనేక సార్లు ఉద్ఘాటించాడు. అయితే అనూహ్యంగా ఈమధ్య వరుసగా సినిమాలు ఒప్పుకునే సరికి రాజకీయంగా ఆయనపై విమర్శలు ఎక్కువయ్యాయి. పవన్ మళ్లీ సినిమాలు చేస్తున్నాడని, పార్ట్ టైమ్ పొలిటీషన్ గా వ్యవహరిస్తున్నారని… సెటైర్లు వేశారు. వీటిపై `వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమాల్లో సంపాదించేది – మళ్లీ సమాజం కోసం ఖర్చు పెట్టడానికే అని వ్యాఖ్యానించి తగిన సమాధానం ఇచ్చారు.
”మూడేళ్లుగా సినిమా చేయలేదు. అయితే ఆ భావన ఎప్పుడూ రాలేదు. నేను దేశం కోసం సమాజం కోసం ఆలోచించే మనిషిని. ఆ తరవాతే సినిమా. నేను సినిమాల నుంచి దూరంగా పారిపోయే వ్యక్తిని కాదు. మంచి కథ వచ్చినప్పుడు, అన్నీ కుదిరినప్పుడు సినిమా చేస్తా. అంతే తప్ప అవకాశాల కోసం ఎవరినీ యాచించను. సినిమాలు చేసేది మళ్లీ సమాజం కోసం ఖర్చు పెట్టడానికే“ అని స్పష్టం చేశాడు పవన్. వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలు చేసుకోవచ్చు గానీ, నేను సినిమాలు చేయకూడదా? అని ప్రశ్నించారు. దేశంలోని అగ్ర దర్శకులంతా తనతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా – తాను మాత్రం తనని ప్రేమించే వాళ్లతోనే సినిమాలు చేయడానికి ఇష్టపడతానని, వేణు శ్రీరామ్, హరీష్ శంకర్ లాంటి దర్శకులు తనని ఇష్టపడి, తనతో సినిమా చేయడానికి ముందుకొచ్చారని, అలాంటి దర్శకులతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని పవన్ చెప్పుకొచ్చాడు. ఎప్పుడూ లేదని `వకీల్ సాబ్` ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ సుదీర్ఘంగా ప్రసంగించాడు. పవన్ మాట్లాడుతున్నప్పుడు `సీఎమ్.. సీఎమ్` అంటూ అభిమానులు గట్టిగా నినాదాలు చేశారు. దాంతో పవన్ కల్పించుకుని `అది మనం అనుకుంటే జరగదు. జరగాలనుకున్నప్పుడు జరుగుతుంది. మీ గుండెల్లో స్థానం కంటే ఏదీ గొప్పది కాదు” అని సమాధానం ఇచ్చారు.