ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యపై అధ్యయనం చేసిన హార్వర్డ్ యూనివర్సిటీ వైద్య నిపుణులతో భేటీ సందర్భంగా జనసేన అద్యక్షుడు నటుడు పవన్ కళ్యాణ్ ప్రసంగంలో అడుగడుగునా అతి జాగ్రత్త కనిపించింది. ఈ సమస్యను రాజకీయం కాకూడదనేది తన ఉద్ధేశమని పదేపదే చెప్పారు. గత ప్రభుత్వాలను గాని ఇప్పుటి పాలకులను గాని అనే బదులు మనం ఈ సమస్య పరిష్కారానికి ఏం చేయగలమో మానవత్వంతో ఆలోచించాలని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సహాయం చేస్తున్నానని కొందరు అంటున్నారని, అయితే వైసీపీ వున్నా ఇలాగే చేసేవాడినని వివరించారు.అవసరమైతే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహనరెడ్డి సహాయం కూడా కోరతానని చెప్పారు. మానవత్వం, వైసీపీ వంటి మాటలు వచ్చినప్పుడల్లా అక్కడ వున్న వారు కేరింతలు కొట్టారు. తాను నల్గొండలోని ఒక గ్రామంలో ఫ్లోరోసిస్ బాధితుల కోసం చేయాలనుకున్నది చేయలేకపోయానని అందుకే ఇప్పుడు ఉద్ధానంలో అన్ని వైపుల నుంచి అధ్యయనం చేసి పరిష్కారం ఎలా అనేది సాధించాలని చూస్తున్నామని అంటూ గొప్ప ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్న పాత సూక్తిని వినిపించారు. ఈ విషయమై 31వ తేదీన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కాబోతున్న సంగతి తెలిసిందే. కొంతమంది ప్రాంతం కోసం కొంతమంది కులం కోసం పోరాడతారు గాని మానవత్వం కోసం కృషి చేయడం ముఖ్యమనిసందేశమిచ్చార. దారి పొడుగునా తన ఫ్లెక్సీలు పెల్టారు గాని నిజమైన హీరోలు వైద్యులేనని చెప్పారు. మొత్తంమీద పవన్ స్వరంలో జాగ్రత్త ఒక వైపు, ఉద్వేగం మరోవైపు గోచరించాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాత్రం షరా మామూలుగా దగ్గరగా రావడానికి ఫోటోల కోసం చుట్టుముట్టడం కనిపించింది.