వైసీపీ నేతలు జనసేన కార్యకర్తలపై ఇష్టం వచ్చినట్లు దాడులకు పాల్పడుతున్నారని..తమదైన రోజున గట్టి సమాధానమిస్తామని అప్పటి వరకూ భరిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాజమండ్రి హోటల్ షెల్టాన్‌లో జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా… పవన్ .. కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజమండ్రిలో తాను కవాతు చేసిన రోజు లక్షల మంది రోడ్లపైకి వచ్చారని.. కానీ ఓట్లు రౌడీలకు వేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో తుఫాన్ వస్తే నాలుగు రోజులు అక్కడే ఉన్నాం.. పక్కనే పర్యటిస్తున్న జగన్ ఆ జిల్లా వైపు కూడా చూడలేదు.. అయినా అలాంటి వాళ్ళను గెలిపించారు అంటే తప్పు ఎవరిదని ప్రశ్నించారు. ధైర్యం నింపడానికే జనసేన పెట్టానని ప్రకటించారు.
దాడుల విషయంలో.. గుండె ధైర్యంతో నిలబడి యువత సత్తా చాటాలని పిలుపునిచ్చారు. క్రిమినల్స్ మనల్ని పాలించాలనుకుంటే వైసీపీకి మద్దతివ్వండి .. సమసమాజ నిర్మాణం కోసం జనసేనకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. జనసేన ఉనికి కోల్పోతే పవన్‌కల్యాణ్ లేనట్లేనని భావోద్వేగంతో ప్రకటించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితులపైనా స్పందించారు. బీజేపీ వారసత్వ పార్టీ కాదు.. అందుకే పొత్తు పెట్టుకున్నామని కొత్త సిద్ధాంతం చెప్పారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం అనే భావన ఏర్పడిందని. వ్యతిరేకం కాదని మైనార్టీలను ఒప్పించి పొత్తు పెట్టుకున్నానని పవన్ చెప్పుకొచ్చారు.
గతంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం అంటే.. కాస్త సందడిగా ఉండేది. బహిరంగసభ ఏర్పాటు చేసేవారు. అయితే పవన్ కల్యాణ్ ఇప్పుడు పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయించడం లేదు. ఆయన సినిమాలపై దృష్టి పెట్టారు. ఈ సారి స్థానిక ఎన్నికలు ఉన్నప్పటికీ.. హోటల్లోనే కార్యక్రమం పూర్తి చేశారు. గతంలో ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు జనసేన నేతల్లో కనిపించలేదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. పెద్దగా ఎక్కువ చోట్ల .. జనసేన నేతలు పోటీ చేయలేకపోయారు.