Pawan Kalyan speech in Uttarandra
విజయనగరంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( డిసిఐ) ఉద్యోగి వెంకటేశ్ ఆత్మహత్యకు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఆ సంఘం చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించడానికి వెళ్లిన జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ ఘాటుగానే ప్రసంగించారు. లాభాలు వచ్చే డిసిఐనిప్రైవేటీకరించడం, వారికి ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి రావలసిన బకాయిలు పేరబెట్టి డిసిఐని ప్రైవేటుకు అప్పగించాలని తలపెట్టడం సరికాదన్నారు. ఇప్పటివరకూ వామపక్షాలు మాత్రమే మాట్లాడుతూ వస్తున్న ప్రైవేటీకరణ సమస్యను జనసేన అద్యక్షుడు చేపట్టడం ఒక విశేషమైతే ఈ సందర్భంగా చేసిన ఉద్వేగ పూరిత ప్రసంగం రాజకీయంగానూ కీలక సంకేతాలిచ్చింది. గత ఎన్నికల్లో టిడిపిబిజెపిలను బలపర్చిన తాను మూడేళ్లకు పైగా సమస్యల పరిష్కారంకోసం నిరీక్షిస్తూ వుండిపోయానని ఇక ఇప్పుడు రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. ఆ పార్టీలూ లేదా వారి ఎంపిలూ ఎంఎల్‌ఎలూ తప్పించుకోవచ్చు గాని తాను ఆ పనిచేయబోనన్నారు. ఇప్పటివరకూ తన స్వంతం కోసం ఏదీ అడగలేదంటూ గబ్బర్‌సింగ్ విషయమై తలెత్తిన సాంకేతిక సమస్యను ప్రస్తావించారు. ఇప్పుడు మొదటిసారిగా డిసిఐని ప్రైవేటీకరించవద్దని ప్రధాని మోడీని కోరుతున్నానని పిఎంవోకు పంపుతున్న వినతి పత్రం చూపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేస్తే తనకు నష్టమని కొందరంటున్నారని చెబుతూ ఏం పీకుతారు, వారిని ఎలా పీకాలో నాకు తెలుసు అని అన్నప్పుడు హర్షధ్వానాలు మార్మోగాయి. పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆద్యంతం ఉత్సాహంగానే విన్నారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబానికి కనీసం ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించవద్దా అని ఎంపిలు కంబంపాటి హరిబాబు, అవంతి శ్రీనివాస్‌ల పేర్లు ప్రస్తావించారు.
తను టిడిపి బిజెపిల పక్షం కాదని తెలుగు రాష్ట్రాల ప్రజల పక్షమని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలో నిర్ణయించుకోలేదు గాని మనసులో కొన్ని పార్టీలు వున్నాయనీ, ప్రజల సమస్యల కోసం నిలబడే పార్టీలే కావాలని తన వ్యూహం సూత్రప్రాయంగా బయిటపెట్టారు. ఏ ఒక్క పార్టీ లేదా నాయకుని వల్లనే అభివృద్ది సాద్యం కాదని పరోక్షంగా ముఖ్యమంత్రిచంద్రబాబు పైన టిడిపిపైన చురకలు వేశారు. అలాగే ముఖ్యమంత్రి అయితేనే సమస్యలు పరిష్కరిస్తానని చెప్పడం సరికాదని ప్రతిపక్ష నేత జగన్ఉద్దేశించిఅన్నారు. అయితే సభలో చాలామంది యువకులు సిఎం సిఎం అని నినాదాలిచ్చారు. అప్పుడు అధికారమే ముఖ్యం కాదని పనిచేయడం ముఖ్యమని వివరణ ఇచ్చారు. మొత్తంపైన ఈ సభలో ఆయన ప్రసంగంలో విషయంతో పాటు చెప్పిన ధాటి కూడా మంచి స్పందనే తెచ్చింది. విభజన సరిగ్గా జరగలేదని గతంలో చేసిన విమర్శ మరోసారి వినిపించారు.