జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపు రిజర్వేషన్లపై తన పార్టీ విధానాన్ని పశ్చిమగోదావరి జిల్లా పోరాటయాత్రలో బహిరంగంగా ప్రకటించారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా.. రాజ్యాంగంలోని తొమ్మితో షెడ్యూల్లో రిజర్వేషన్ల అంశాన్ని పెట్టించేదిశగా జనసేన పోరాటం చేస్తుందని ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి… కాపు రిజర్వేషన్ల అంశం తన చేతుల్లో లేదని.. ఏమీ చేయలేనని ప్రకటించిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారం రేగింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ దీనిపై ఆచితూచి స్పందించారు. న్యాయనిపుణులు, రాజ్యాంగనిపుణులు, మేధావులతో చర్చించి.. స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అంత కంటే ముందే.. పశ్చిమగోదావరి జిల్లా పోరాటయాత్రలో తన విజన్‌ను ప్రకటించారు.
అయితే జనసేనాధినేత.. కాపు రిజర్వేషన్ల విషయంలో చాకచక్యంగా వ్యవహరించారు. ఇతర వర్గాల మనోభావాలు దెబ్బతినకుండా ప్రసంగించారు. బీసీల రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. కాపులకు రిజర్వేషన్లు ఇప్పిస్తామన్నారు. అలాగే మహిళా రిజర్వేషన్లపైనా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. వెంటనే బిల్లును ఆమోదించాల్సి ఉందన్నారు. పోరాటయాత్రలో… అధికార పార్టీని చంద్రబాబు టార్గెట్ చేసుకోవడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. చంద్రబాబునాయుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలతో సహా అందర్నీ మోసం చేశారని మండి పడ్డారు.
పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్ పర్యటనకు యువత పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. పవన్ కల్యాణ్ ఎవర్నీ నిరాశ పరచడం లేదు. వ్యూహాత్మకంగా ఉదయం పూట వివిధ వర్గాలతో సమావేశమవుతున్నారు. పోరాటయాత్రలో స్థానిక సమస్యలనూ ప్రస్తావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో జరిగిన పోరాటయాత్రతో పోలిస్తే.. పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చే సరికి కాస్తంత మౌలికమైన మార్పు కనిపిస్తోంది. నిర్మాణాత్మక విమర్శలు చేస్తున్నారు. రాజకీయ పరంగా హామీలు ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. తన ప్రసంగాల్లో అధికార పార్టీని, చంద్రబాబును, ఆయన కుమారుడ్ని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నా.. జగన్ పైనా విమర్శలు చేస్తున్నారు.