తెలంగాణ ఎన్నికల మీద తన స్టాండ్ ఏమిటన్నది డిసెంబర్ 5న ప్రకటిస్తాం అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు ట్విట్టర్ ద్వారా ఒక వీడియో సందేశాన్ని పంపించారు. నేరుగా ఏ పార్టీకి మద్దతు పలకకుండా మంచి వారికి ఓటు వేయమని చెబుతూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే..
“అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ధనం దాచగలరేమో కానీ తేజస్సును దాచగలరా? తెరలు దించగలరేమో కానీ శిరస్సు వంచగలరా? తమ మంత్రం పారదింక. ఉచ్చు తెంచుకున్న జింక. ఇక స్వేచ్ఛా ప్రయాణం. ఇదే మన తెలంగాణ, కోటి రతనాల తెలంగాణ అని దాశరధి గారు చెప్పిన మాటలు నా మదిలో మారుమ్రోగుతున్నాయి. అలాంటి తెలంగాణ సమరయోధుల స్ఫూర్తిని, స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని నింపుకుని తెలంగాణ యువత ఈరోజు తెలంగాణ సాధించుకో గలిగింది. సరికొత్త రాష్ట్రాన్ని ఇన్ని ఒడిదుడుకుల మధ్య సాధించుకోగలిగింది. తెలంగాణ పోరాట స్ఫూర్తిని త్యాగాలను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను కాబట్టి నాకు తెలంగాణ అంటే అంత గౌరవం. కానీ ఈ రోజు ముందస్తు ఎన్నికలు రావడం వల్ల, సమయాభావం వల్ల నేను ఎక్కువ సమయాన్ని కేటాయించ లేకపోవడం వల్ల తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేయలేకపోతోంది. ఇప్పుడు మన ముందు ఉంది – తెలంగాణ ఇచ్చామనే వాళ్ళు, తెలంగాణ తెచ్చామనే వాళ్ళు, తెలంగాణ పెంచామనేవాళ్ళు. వీళ్లందరి మధ్యలో మనం ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు అనే అయోమయ పరిస్థితిలో నా విన్నపం ఒకటే. నేను ఆలోచిస్తోంది కూడా, మనకి అత్యంత ఎక్కువ పారదర్శకతతో, తక్కువ అవినీతితో ఎవరైతే మంచి పాలన అందించగలరో, లోతుగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని, తెలంగాణ లో ఒక బలమైన ప్రభుత్వాన్ని అందివ్వమని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను”
ఇవీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. మొత్తానికి అటు టిఆర్ఎస్ కి గానీ, ఇటు ప్రజా కూటమి కి కానీ లేదా బిఎల్ఎఫ్ కి కానీ నేరుగా మద్దతు పలకకుండా మంచి వారిని ఎన్నుకోండి అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.