పవన్ కల్యాణ్ సడెన్ గా కడప టూర్ పెట్టుకున్నారు. అధికారిపై వైసీపీ నేతలు చేసిన దాడితో ఆయన వెంటనే అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేతలు గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడి చేశారు. ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి 20 మంది అనుచరులతో మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి.. ఎంపీపీ ఛాంబర్ తాళం ఇవ్వాలని రుబాబు చేశారు. ఎంపీపీకి మాత్రమే తాళాలు ఇస్తానని ఎంపీడీవో చెప్పడంతో ఆయనపై దాడి చేశారు. ఎంపీడీవో కుర్చీలో నుంచి కింద పడిపోయినా ఆగకుండా కాళ్లతో తన్నుతూ పిడిగుద్దులు కురిపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వారిని చెదరగొట్టారు. తీవ్రంగా గాయపడిన ఎంపీడీవోను రాయచోటి ఆస్పత్రికి తరలించారు. సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అధికారిపై దాడిలో పాల్గొన్న అతని అనుచరుల కోసం గాలింపు చేపట్టారు. తనకు వైసీపీ నేతల నుంచి ప్రాణ హాని ఉందని.. ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఎంపీడీవో జవహర్‌బాబు విలపిస్తూ విజ్ఞప్తి చేశారు.
ఎంపీడీవోపై దాడి వ్యవహారాన్ని డిప్యూడటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ గా తీసుకున్నారు. ఎంపీడీవోను పరామర్శించాలని నిర్ణయించారు. శనివారం ఉదయం ఆయన కడప రిమ్స్ కు వెల్లనున్నారు. అక్కడ ఎంపీడీవోను పరామర్శించనున్నారు. కడప జిల్లాలో అధికారులను వైసీపీ నేతలు బెదిరించకుండా పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారని .. ఉద్యోగులకు భరోసా ఇస్తారని చెబుతున్నారు.