జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ నిన్న ట్వీట్ మెసేజ్ పోస్ట్ చేసారు. రాజధాని కోసం కొందరు రైతులు ఇప్పటికే తమ భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేసారు. కానీ మరికొందరు తమ భూములను ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. అటువంటి వారి దగ్గర నుండి భూములను స్వాధీనం చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 20న భూసేకరణ చట్టం ప్రయోగించి వారి నుండి భూములను స్వాధీనం చేసుకొబోతున్నట్లు ప్రకటించింది. దానిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ “రైతులపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగించవద్దని తెదేపా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. భూసేకరణ సమస్యని సామరస్య వాతావరణంలో పరిష్కరించి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను,” అని ఒక ట్వీట్ మెసేజ్ పెట్టారు.
ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమయిన భూములపై ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణం చేయాలనుకోవడమే తప్పు. ఎందుకంటే కోట్లు పెట్టి భూములు కొనవచ్చేమో కానీ అటువంటి భూములను మరెక్కడా పునః సృష్టించడం అసంభవం. పంటభూములను కప్పెట్టి దానిపై కాంక్రీట్ జంగిల్ నిర్మించడం వలననే రాష్ట్రానికి ఎక్కువ లాభం చేకూరుతుందో లేక అదొక చారిత్రిక తప్పిదమో అవుతుందో భవిష్యతులో తెలుస్తుంది.
ప్రభుత్వానికి దాని కారణాలు దానికి ఉండవచ్చును. తప్పో ఒప్పో అడుగు ముందుకు వేసింది కనుక ఇక ఆగే ప్రసక్తే ఉండదు. త్వరలో రాజధాని నిర్మాణ కార్యక్రమాలు భారీ ఎత్తున మొదలు పెట్టేందుకు సిద్దం అవుతోంది కనుక అందుకోసం అన్నిటికంటే ముందుగా భూమి సిద్దం చేసుకోవాలి. కానీ ఇప్పటికీ కొందరు రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కూడా. కనుక పిచుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నట్లు వారిపై తిరుగులేని భూసేకరణ చట్టాన్ని ప్రయోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అవుతోంది.
దానిపై స్పందించిన పవన్ కళ్యాణ్ భూసేకరణ చట్టం ప్రయోగించవద్దని, ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలని సూచించారు. కానీ అది ఆయన చెప్పినంత తేలిక కాదు. సాధ్యం కాదు కూడా. అందుకే రాష్ట్ర ప్రభుత్వం చివరిగా ఈ బ్రహ్మాస్త్రాన్ని వారిపై ప్రయోగించేందుకు సిద్దపడుతోంది. ఇంతవరకు వచ్చిన తరువాత భూసేకరణకు ఇంతకంటే ప్రత్యమ్నాయ మార్గం లేదు కూడా.
కనుక ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రైతులపి భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి వారి నుండి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకోదలిస్తే కనీసం అప్పుడయినా పవన్ కళ్యాణ్ అడ్డుకొంటారా లేక దానికి నిరసన తెలుపుతూ మరొక ట్వీట్ మెసేజ్ పెట్టి తన వల్ల రాష్ట్రానికి, రాజధాని నిర్మాణానికి మరిన్ని సమస్యలు ఎదురవకూడదనే కారణంతో తనను తాను నిగ్రహించుకొంటున్నానని మరో సంజాయిషీ పెడతారో చూడాలి.
కానీ ఆయన ఈవిధంగా ప్రతీ అంశంపై ద్వంద వైఖరి అవలంభించడం గమనిస్తే చంద్రబాబు నాయుడు చేతిలో ఆయన కీలుబొమ్మగా మారారా…లేక ఆయనే చంద్రబాబుని ఈవిధంగా ఆడుకొంటున్నారా? అనే అనుమానాలు కలుగక మానవు.
ఉదాహరణకి ఆయన ఇంతకు ముందు రాజధాని ప్రాంతాలలో పర్యటించి బలవంతపు భూసేకరణను అడ్డుకొంటానని అవసరమయితే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్దమని ప్రకటించారు. కానీ హైదరబాద్ వెళ్ళగానే మాట మార్చారు. రైతుల తరపున పోరాడేందుకు మళ్ళీ వెంటనే వస్తానన్న పెద్దమనిషి మళ్ళీ ఇంతవరకు ఆ ఊసే ఎత్తలేదు. అంటే ఆయన చంద్రబాబు కనుసన్నలలో నడుస్తున్నరనుకోవాలా? తను భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడితే ఆయనకు ఇబ్బంది కలుగుతుంది కనుక వెనక్కి తగ్గారనుకోవాలా? లేకుంటే ఇంతకాలం ఈ సమస్య గురించి రైతులు తీవ్ర ఆందోళన చెందుతుంటే ఆయన ఎందుకు దాని గురించి మాట్లాడలేదు?
కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందు మరే ప్రత్యామ్నాయ మార్గం లేదని తెలిసీ కూడా ఆయన “భూసేకరణ చట్టాన్ని వారిపై ప్రయోగించవద్దు. సమస్యని సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలి,” అని సూచించడం చూస్తే ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినట్లుంది. అంటే ప్రభుత్వం తను చెప్పినట్లుగా నడవాలని కోరుకొంటున్నారా? కోరుకొంటే ఏ హక్కు, హోదాతో కోరుకొంటున్నారు? పవన్ కళ్యాణ్ ఈవిధంగా ట్వీటర్లో ప్రత్యేక హోదా గురించి, రాజధాని రైతుల ప్రయోజనాల గురించి బాధపడిపోవడం కంటే తనే స్వయంగా చొరవ తీసుకొని ఈ సమస్యలన్నిటినీ ఏవిధంగా పరిష్కారంచ వచ్చో చూపిస్తే బాగుంటుంది కదా?