స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ ఆడుతున్న పొలిటికల్ గేమ్‌లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గల్లీల్లో ఆడే డ్రామాలు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసమేనని.. ఢిల్లీలో ఏం ప్రయత్నాలు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో ప్రత్యేకంగా బీజేపీ-జనసేన కూటమి కోసం ప్రచారానికి వెళ్లలేకపోయిన పవన్ కల్యాణ్… రోజుకో వీడియో విడుదల చేస్తున్నారు. వైసీపీ విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో రోజుకో అంశంపై.. జనసైనికులు.. దిశానిర్దేశం చేస్తున్నారు. ఆదివారం స్టీల్ ప్లాంట్ అంశంపై పవన్ కల్యాణ్ మాట్లాడారు. 2 మంది వైకాపా ఎంపీలకు రాష్ట్రం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ కోసం దిల్లీలో ఏం చేశారో చెప్పాలన్నారు.
పార్లమెంట్ సాక్షిగా తమ వాణిని వినిపించాలన్నారు. అలా కాకుండా కేవలం మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లకోసం రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు చేస్తుంటే ప్రజలెవ్వరూ నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై వైకాపా చేస్తున్న నిరసనలు కేవలం మున్సిపల్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చేస్తున్న డ్రామాలని విరుచుకుపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొత్తం వైసీపీకి.. ఏపీ అధికార పార్టీకి తెలిసే జరిగిందని అనేక పత్రాలు వెలుగులోకి వచ్చాయి. అయితే.. వైసీపీ నేతలు మాత్రం.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తామంటూ.. బంద్లలలో పాల్గొంటున్నారు.
అసలు అధికారంలో ఉండి.. ఢిల్లీలో పోరాటాలు చేసి.. కేంద్రాన్ని ప్రశ్నించి.. పార్లమెంట్లో నిలదీసి.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాల్సి ఉంటే… వైసీపీ నేతలు మాత్రం.. గల్లీలో అంటే విశాఖలోనే ఉద్యమాలు చేసి.. ప్రజల ముందు షో చేస్తున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటున్నారు కానీ అడ్డుకుంటామని చెప్పడం లేదు. వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కల్యాణ్ కూడా… ఇదే పాయింట్‌ను లేవెనత్తి వైసీపీని ప్రశ్నిస్తున్నారు.