జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ బంగ్లాదేశ్ లో హింసకు గురవుతున్న హిందూ సమాజం కోసం ఏదైనా చేయాలనుకుంటున్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన మహమ్మద్ యూనస్ ఇప్పుడు బంగ్లాదేశ్ ను పరిపాలిస్తున్నారు. ఆయనకు ప్రజలు ఓట్లు వేయలేదు. కానీ అధ్యక్షురాల్ని తరిమికొట్టిన వారు ఆయనను ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. ఆయన బంగ్లాదేశ్ ను వర్గ పోరాటాల కేంద్రంగా మారుతున్నారు. హిందువులపై దాడులు చేయిస్తున్నారు. ఇలాంటి సమయంలో హిందువుల కోసం ఉద్యమిస్తున్న ఇస్కాన్ స్వామిజీ చిన్మయి కృష్ణ ప్రభును దేశద్రోహం కింద అరెస్టు చేశారు.
చిన్మయి కృష్ణ ప్రభుపై అరెస్టుపై ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగింది. ఆయనను తక్షణం విడుదల చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. హిందువులపై దాడులు వద్దని.. బంగ్లాదేశ్లో మైనార్టీలు గా ఉన్న వారిని కాపాడాలని కోరడం తప్పెలా అవుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ మరింత బలంగా ఈ వాదన వినిపిస్తున్నారు. చిన్మయి కృష్ణ ప్రభుకు పూర్తి స్థాయిలో ప్రాథమిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. ఆయన స్పందించాల్సిందిగా ప్రపంచం మొత్తాన్ని కోరుతూ ట్వీట్ చేశారు.
మన దేశం కసబ్ లాంటి వాడికి కూడా ప్రాథమిక హక్కులు, పారదర్శక విచారణను కూడా ఇచ్చిందని కానీ చిన్మయి కృష్ణ ప్రభును కనీసం కోర్టులో కూడాప్రవేశ పెట్టడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ దమనకాండపై అందరూ స్పందించాల్సిన అవసరం ఉందని పిలుపునిస్తున్నారు. పవన్ కల్యాణ్ గతంలోనూ ఈ అంశంపై స్పందించారు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ముందు ముందు బంగ్లాదేశ్ హిందువుల కోసం ఆయన ఏదైనా కార్యక్రమం చేపట్టే ఉద్దేశంలో ఉన్నారని అనుకోవచ్చు.