జాతీయ పార్టీలకు ధీటుగా థర్డ్ ఫ్రెంట్ రావాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నానికి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. భారత సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కేసీఆర్ కు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. విభజన తరువాత తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన అనుసరించిన విధి విధానాలు ప్రశంసనీయం అన్నారు! ఇదే క్రమంలో ప్రత్యేక హోదాకు మద్దతు పలికినందుకు ఆంధ్రా ప్రజల తరఫున ధన్యవాదానాలు తెలిపారు. దీంతో తెలుగువారు ఎక్కడున్నా ఒకరికి ఒకరు సాయంగా నిలుస్తారన్న భావాలు బయటకి వచ్చాయన్నారు.
ఆంధ్రా ప్రజలు తీవ్రంగా రగిలిపోతున్నారనీ, రోడ్ల మీదికి వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితి ఉందనీ, ఈ సమయంలో కేసీఆర్ కు మాట్లాడాల్సిన అవసరం లేనప్పటికీ హోదా గురించి మాట్లాడటం తెలుగు ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలను బయట పెట్టుకున్నట్టయిందని పవన్ అన్నారు. జాతీయ పార్టీల తీరువల్లే ప్రాంతీయ పార్టీలూ పుడుతున్నాయన్నారు. యూపీయే అనుకున్న సమయంలో తెలంగాణ ఇచ్చేసి ఉంటే తెరాస పుట్టాల్సిన అవసరం ఉండేది కాదనీ, అప్పటికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంజయ్యను అగౌరపరచకుంటే టీడీపీ పుట్టేది కాదనీ, ప్రజల మనోభావాలకు విరుద్ధంగా విభజన జరిగి, ఇన్ని సమస్యలు లేకుండా కేంద్రం చూసి ఉంటే జనసేన ఆవిర్భవించేదే కాదన్నారు. ప్రజల ఆకాంక్షల్ని జాతీయ పార్టీలు అర్థం చేసుకోలేకపోతున్నాయని పవన్ అన్నారు.
మొత్తానికి, కేసీఆర్ మూడో ప్రత్యామ్నాయ ఆలోచనకు పవన్ కూడా మద్దతు ప్రకటించారు. కేసీఆర్ మాటల్లో ప్రత్యేక హోదా ప్రస్థావన ఉండటంతో పవన్ మురిసిపోతున్నారు..! కానీ, ఏపీ ప్రయోజనాలకు కేసీఆర్ కట్టుబడి ఉంటేనే మూడో ఫ్రెంట్ కి తన మద్దతు అని పవన్ చెప్పి ఉంటే మరింత బాగుండేది. ప్రస్తుతం పార్లమెంటులో మరోసారి ఏపీ ప్రయోజనాల విషయమై పోరాడేందుకు టీడీపీ ఎంపీలు సిద్ధమౌతున్నారు. వారికి మద్దతుగా తెరాస నిలవాలంటూ పవన్ కోరితే ఇంకా బాగుండేది. ఎందుకంటే, తనను తాను జాతీయ స్థాయి నేతగా కేసీఆర్ ప్రతిష్ఠించుకునే క్రమంలో.. ఇతర రాష్ట్రాల సమస్యలపై తనదైన శ్రద్ధ కనబరచాల్సిన సమయం కదా ఇది! ఎలాగూ, దేశమంతా ఇప్పుడు ఆంధ్రావైపు చూస్తోంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ నిజంగానే ఆంధ్రా సమస్యలపై మరింత తీవ్రంగా గళమెత్తితే… పవన్ చెప్పినట్టుగా ఆంధ్రుల తరఫున ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పొచ్చు.