జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలలో వారాహి విజయ యాత్ర పేరుతో చేస్తున్న పర్యటనకు రెండు రోజులు బ్రేక్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఉపవాస దీక్షలో ఉండటంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. దీంతో భీమవరంలో జరగాల్సిన తూర్పుకాపు నేతల సమావేశాన్ని కొన్ని గంటలు వాయిదా వేసి అనంతరం నిర్వహించారు..వైద్యుల పవన్ కల్యాణ్ కు వైద్య పరీక్షలు నిర్వహించి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవల్పిందిగా సూచించారు.. దీంతో రెండు రోజుల పాటు వారాహి విజయ యాత్రను వాయిదా వేస్తున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. 30వ తేదీన సాయంత్రం భీమవరంలో పవన్ కల్యాణ్ బహిరంగసభ ఉంటుంది.
ఈ నెల 14వ తేదీన పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర ప్రారంభించారు. అప్పట్నుంచి నిరాటంకంగా యాత్ర చేస్తున్నారు. నియోజకవర్గానికి రెండు రోజుల చొప్పున కేటాయించారు. ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. వివిధ వర్గాల నేతలతో తీరిక లేకుండా చర్చలు జరుపుతున్నారు. వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా జూన్ 20 నుంచి పవన్ కల్యాణ్ దీక్ష చేస్తున్నారు. ఇది వచ్చే నెలలో ముగియనుంది. అదే టైంలో చాతుర్మాస దీక్ష ప్రారంభంకానుంది. ఈ లెక్క ప్రకారం పవన్ కల్యాణ్ కార్తీకర మాసం పూర్తి అయ్యే వరకు దీక్షలోనే ఉంటారు.
ఈ దీక్షలో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోరు. కేవలం పాలు, పండ్లను మాత్రమే తిసుకుంటారు. అందుకే ఈ మధ్య కాలంలో తరచూ నీరసానికి గురి అవుతున్నారు. మొన్నీ మధ్య ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూనే కాసేపు రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని మళ్లీ 30వ తేదీ నుంచి యాత్రను కొనసాగించనున్నారు.