జనసేన అధినేత పవన్ కల్యాణ్.. శ్రీకాకుళం పర్యటనలో తెలుగుదేశం పార్టీని వీరలెవల్లో ఉతికేస్తున్నారు. అది ఆయనకు.. ఆయన ఫ్యాన్స్ కు.. జనసేన కార్యకర్తలకు కావాల్సినంత కిక్ ఇస్తోంది. కానీ… తాను కూడా.. ఆరోపణలు.. ప్రత్యారోపణల రాజకీయాల్లో ఆ తాను ముక్కను కాదని నిరూపించుకోవాలంటే.. కొన్ని కొన్ని అంశాల్లో మరింత స్పష్టత నివ్వాల్సి ఉంటుంది. అందులో మొదటి.. ప్రత్యేకహోదా పోరాటం. కేంద్రంపై యుద్ధం చేయడం. మాట్లాడితే ప్రత్యేకహోదా పోరాటాన్ని తానే ప్రారంభించానని… పవన్ కల్యాణ్ .. దాదాపుగా ప్రతీ స్పీచ్ లోనూ చెబుతూంటారు. తాను మొదటి నుంచి ఒకే విధానంలో ఉన్నానని.. కానీ చంద్రబాబు మాత్రం ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చుకుంటూ వస్తున్నారని విమర్శించారు.
ఒపీనియన్స్ చేంజ్ చేసుకోని వాడు పొలిటిషియన్ కాదన్నట్లు… పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటేనే ఎవరైనా మనగలుగుతారు. ఆ విషయం పవన్ కు తెలియనిదేం కాదు. ఆయన చదివిన పుస్తకాల్లో ఎక్కడో చోట ఈ లాజిక్ తగిలే ఉంటుంది.
అందుకే..జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూల్లో పేరు లేకపోయినా… డబ్బులిస్తే చాలని మాట్లాడారు. కానీ తెలుగు మీడియాలో మాత్రం హోదా జపం చేస్తూంటారు. మళ్లీ ఇప్పుడు శ్రీకాకుళంలో ప్రత్యేకహోదా ఉద్యమం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ తనేనని చెప్పుకుంటున్నారు. అది నిజమే.. మొదట హోదా పోరాటం పవన్ కల్యాణే ప్రారంభించారు.
వాస్తవంగా… ప్రత్యేకహోదా విషయంలో వైఎస్ జగన్ పోరాటాన్ని ప్రజలంతా లైట్ తీసుకున్నప్పుడు పవన్ కల్యాణ్… తిరుపతి, కాకినాడ, అనంతపురంలలో సభలు పెట్టారు. హోదాపై మంచి పోరాటమే చేశారు. అనంతపురంలో సభ పెట్టిన తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టడంతో.. కేంద్రం.. అర్థరాత్రి ప్యాకేజీ ప్రకటించింది. ఆ తర్వాత కాకినాడ సభలో ఈ ప్యాకేజీలో పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. ఉద్యమాన్ని ఆపబోనన్నారు. కానీ ఆ తర్వాత పవన్ కల్యాణ్ సైలెంటయిపోయారు. ప్రత్యేకహోదా అనే మాటనే మార్చిపోయారు. చివరికి అటు ప్యాకేజీ కూడా ఇవ్వడం లేదని చంద్రబాబు ఆగ్రహించి..మళ్లీ హోదా నినాదం ఎత్తుకుని.. రోడ్ల మీదకు వచ్చినా.. పవన్ కల్యాణ్ స్పందించలేదు. రాష్ట్రం మొత్తం హోదా సెంటిమెంట్ తో రగిలిపోతూంటే…ఆవిర్భావ సభ పేరుతో… నేరుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి .. డైవర్షన్ అంకుల్ గా మారిపోయాన్న విమర్శలకు గరయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు ధర్మపోరాటం రోజు… ఫిల్మ్ చాంబర్ లో చేసిన షో దెబ్బకు ఇది నిజమేనన్న భావన పెరిగిపోయింది.
ఆ తర్వాత కూడా.. ప్రత్యేకహోదా కోసం ఆమరణదీక్ష చేస్తామన్నారు… ఇంకేదో పోరాటాలు చేస్తామన్నారు కానీ.. అన్నీ మర్చిపోయారు. ఇప్పుడు కేవలం … చంద్రబాబు మాత్రమే టార్గెట్ గా కనిపిస్తున్నారు. ప్రత్యేకహోదాపై తన విధానాన్ని డిఫెండ్ చేసుకోవడానికి మొదట తానే ప్రారంభించానని చెబుతున్నారు. ప్రజలు కూడా దీన్ని కాదనట్లేదు. పవనే ప్రారంభించారంటున్నారు. కానీ ఎందుకు కొనసాగించడం లేదని ప్రశ్నిస్తున్నారు. కేంద్రంపై అంత సాఫ్ట్ కార్నర్ ఎందుకంటున్నారు..? ఒకప్పుడు ఉత్తరాది అహంకారి అంటూ.. చెలరేగిపోయిన మోదీపై . ఇప్పుడు ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. సమాధానం చెబుతావా పవన్..