రాజకీయ నాయకుల మధ్య విమర్శలూ ప్రతివిమర్శలు టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఉంటాయి. అంటే, ఎప్పటికప్పుడే స్పందనలు ఉంటాయి. కానీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఆయన విమర్శించిన వారిపై వెంటనే స్పందించెయ్యరు! కొంత సమయం తీసుకుంటారు. ఏదో ఒక సభ పెట్టాక… తనపై ఎవరెవరు ఎలాంటి ఆరోపణలు చేశారనేది నోట్ చేసుకుని మరీ తనదైన శైలిలో విమర్శల్ని తిప్పి కొడతారు. ఆయన ఫ్యూచర్లో ప్రజలకు చెప్పాలనుకుంటున్న ప్రతీ అంశాన్నీ కూడా ముందుగా నోట్ చేసుకుంటారని అంటారు. అలాగే, తాజాగా ఒక విషయాన్ని కాస్త ప్రముఖంగా నోటీస్ చేసి మరీ నోట్ చేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు!
ఇంతకీ, పవన్ నోట్ చేసుకున్న ఆ విషయం ఏంటంటే… మీడియా కవరేజ్! జనసేన పార్టీ, పవన్ కల్యాణ్‌కు సంబంధించిన వార్తల కవరేజ్ మీద ఆయన దృష్టి సారించినట్టు సమాచారం. ముఖ్యంగా, ప్రత్యేక హోదా సాధన ఉద్యమాన్ని ప్రకటించిన దగ్గర నుంచీ కొన్ని మీడియా సంస్థలు మద్దతు ఇవ్వడం లేదన్న అభిప్రాయం పవన్ కల్యాణ్‌కు కలిగిందని తెలుస్తోంది. జనసేన ప్రారంభం నుంచీ అన్ని మీడియా సంస్థలూ పవన్‌కు బాగానే కవరేజ్ ఇచ్చాయి. తిరుపతిలో సభ విషయంలో కూడా మీడియా తనకు ఇచ్చిన ప్రాధాన్యతపై పవన్ ఖుషీగానే ఫీల్ అవుతున్నారు. అయితే, ఆ తరువాత జరిగిన రాజమండ్రి, అనంతపురం సభలకు సంబంధించి కొన్ని ప్రముఖ వార్తా సంస్థలు ఇచ్చిన ప్రాధాన్యతపై పవన్ కల్యాణ్ కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.
నిజానికి, పవన్ కల్యాణ్ సభ అనగానే రాష్ట్రంలో ప్రజలందరి అటెన్షన్ అటువైపు ఉంటుంది. కానీ, కావాలనే తన సభల్ని తక్కువ చేసి చూపించాలన్న ధోరణి కొన్ని మీడియా సంస్థల్లో కనిపిస్తోందనీ, ఈ పరిస్థితి ఎలా డీల్ చేయాలన్న విషయమై కొంతమందితో పవన్ సమాలోచనలు జరుపుతున్నట్టుగా కూడా చెబుతున్నారు! సదరు వార్తా సంస్థల తీరుపై కూడా పవన్ ఒక నోట్ రాసుకున్నారని చెబుతున్నారు. మామూలుగా అయితే, పవన్ ఒక నోట్ రాసుకున్నారంటే భవిష్యత్తులో ఏదో ఒక సభలో దాని గురించి కచ్చితంగా మాట్లాడతారని అంటారు. మరి, ఈసారి ఏకంగా తన పోరాట వార్తల కవరేజ్‌కు సంబంధించిన నోట్స్ అంటే… భవిష్యత్తులో పవన్ ఎలాంటి విషయాలను బయటపెడతారో చూడాలి మరి!
ఏదేమైనా, పాలిటిక్స్‌లోకి వచ్చాక ఎవరి మీడియా వారికి ఉండాలంతే! ఒక న్యూస్‌కు సంబంధించి రెండు రకాల వ్యూస్‌ను రోజూ మనమే చూస్తున్నాం. అధికారంలో ఉన్న పార్టీలకు దూరంగా పవన్ కల్యాణ్ జరుగుతూ ఉంటే.. ఆయా పార్టీలకు అండగా ఉన్న మీడియా సంస్థల్లో పవన్ కల్యాణ్ వార్తలు కూడా నెమ్మదిగా లోపలి పేజీల్లోకి జరుగుతూ ఉంటాయి!