కౌలు రైతుల భరోసా యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా వాసులు తలుచుకుంటే తాను సీఎం అవగలుగుతానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
2019 ఎన్నికల్లో దారుణ పరాజయం మూటకట్టుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంతో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కౌలు రైతుల భరోసా యాత్ర పేరిట , రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కవులు రైతు కుటుంబాలలో, దాదాపు 3,000 మంది కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయలకు పైగా ఆర్థిక సహాయాన్ని పవన్ కళ్యాణ్ అందిస్తూ ఉన్నారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి , చంద్రబాబు, జగన్ వంటి ఎంతోమంది నేతలు పాదయాత్రల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారంలోకి వచ్చినప్పటికీ ఆయా యాత్రల సందర్భంగా వారు తమ సొంత ఆదాయంలోంచి ప్రజలకు నేరుగా ఇంత భారీ ఎత్తున ( 30 కోట్ల కి పైగా) సాయం చేసిన ఉదంతం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ చేస్తున్న కౌలు రైతు భరోసా కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది.
ఈ యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్, తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలోని అత్యంత చైతన్యవంతమైన జిల్లాల్లో ఒకటి అని, ఈ జిల్లా వాసులు ఎటువైపు మొగ్గు చూపితే మిగతా రాష్ట్రం కూడా అనతి కాలంలోనే అటువైపు మొగ్గు చూపుతుందని వ్యాఖ్యానించారు. అందుకే తాను తూర్పుగోదావరి జిల్లా వాసులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నానని అంటూ, 2008 సంవత్సరం నుండి ఇప్పటివరకు తాను ఏం మాట్లాడుతున్నది, ప్రజల తో ఎలా మమేకం అవుతూ ఉన్నదీ అన్నిటికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో దొరుకుతాయని, వాటిని చూసి తనను అర్థం చేసుకోవాలని, తాను చేస్తున్నది సరైనదే అనిపిస్తే తనకు అండగా నిలవాలని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా వాసులు తాను చేస్తున్నది సరైనదే అని నమ్మి తనకు అండగా నిలబడితే తాను కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనా గతంతో పోలిస్తే జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కాస్త బలం పుంజుకుందని, ప్రత్యేకించి గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం ఉదృతంగా ఉండే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ చిరకాల స్వప్నం నిజం అవడానికి తూర్పుగోదావరి జిల్లా వాసులు ఎంతవరకు సాయపడతారు అనేది వేచి చూడాలి