పిఠాపురం జయకేతనం సభలో పవన్ కల్యాణ్ చేసిన భాషా వివాదంపై వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు కారణం అయ్యాయి. అది బహిరంగంగా జరుగుతోంది. కానీ బీజేపీలో అంతర్గతంగా మరో చర్చ జరుగుతోంది. గోధ్రా అల్లర్లు,అందులో ముస్లింలు చనిపోవడంపై తనను ఎంతో బాధించిందని అందుకే తన ఓ సినిమాలో ఓ పాట మాస్టార్జీతో రాయించి పెట్టానని చెప్పుకున్నారు. తప్పుడు ఎవరు చేసినా స్పందించాలన్న ఉద్దేశం లో పవన్ ఈ మాట అన్నారు.
పవన్ కల్యాణ్ ఉద్దేశం మంచిదే కానీ ఆయన ఎంచుకున్న ఉదాహరణ మాత్రం చాలా ప్రమాదకరమైనదిగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. గోధ్రా అల్లర్ల ఘటన నేపధ్యం తెలిసిన వారు ఎవరూ బీజేపీతో సన్నిహితంగా ఉంటూ ఆ అల్లర్ల ప్రస్తావన, అందులో ముస్లింల మరణాల గురించి మాట్లాడే ప్రయత్నం చేయరు. చేసినా అది తమ వాదనను సమర్థించుకునేలా చేస్తారు కానీ.. ఆ ఘటన వల్ల తాము ఎంతో ప్రభావితం అయ్యానని.. పాటలు రాయించుకున్నానని ఎవరూ చెప్పరు. అలా చెబితే.. చేరాల్సిన వారికి వేరే సంకేతాలు వెళ్తాయి.
పవన్ కల్యాణ్ విషయంలో బీజేపీ ఎలాంటి ఉద్దేశాలతో ఉందో తెలియదు కానీ.. ఆవిర్భావ సభలో ఆయన గోధ్రా అల్లర్ల గురించి మాట్లాడిన అంశాలపై కొన్ని నివేదికలు కేంద్రానికి చేరాయన్న ప్రచారం జరుగుతోంది. కేంద్ర ఇంటిలిజెన్స్ బ్యూరో జనసేన సభపై స్పందించిందని ..మోదీ ఆరా తీశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బహుశా ఆయన ఆరా తీసి ఉంటే ఈ అంశంపైనే ఆరా తీసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా గోద్రా కాకుండా.. పవన్ కల్యాణ్ మరేదైనా టాపిక్ ను ఉదాహరణగా చెప్పి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం మాత్రం జనసేన శ్రేయోభిలాషుల్లో వ్యక్తమవుతోంది.