గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేస్తున్న పవన్ కల్యాణ్ తన టార్గెట్ గురించి తరచూ చెబుతున్నారు. అదేమిటంటే.. గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వకుండా చేయడం. తాజాగా నర్సాపురం నేతలతో సమావేశం అయిన పవన్ కల్యామ్.. ఇదే లక్ష్యాన్ని పార్టీ నేతల మందు పెట్టారు. యుద్ధం మొదలుపెట్టినప్పుడు ముందుగా చిన్న చిన్న కోటలు కొట్టాలి.. మనం కూడా అదే బాటలో ముందుకు వెళ్ది.. ముందుగా ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ విముక్త ప్రాంతాలుగా చేద్దామని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
ఇక్కడున్న 34 స్థానాల్లో ఒక్కటి కూడా వైసీపీ గెలవకూడదు. ఆ స్థాయిలో జనసైనికులు, జనసేన నాయకులు బలంగా పని చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిస్తున్నారు. ప్రతీ చోటా పార్టీ నేతలకు ఇదే చెబుతున్నారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి కాకముందు ఆయన చేయాల్సిన దారుణాలన్నీ చేశారన్నారు. అప్పట్లోనే ఎస్సైని వేసి కొట్టిన వ్యక్తి ఆయన. ..ఇప్పుడు వైసీపీ నాయకులు, వారి పిల్లలు కూడా అదే ఫాలో అవుతూ ఎస్పీ, డీఎస్పీలను కొడుతున్నారని మండిపడ్డారు. బాపట్లలో 15 ఏళ్ల కుర్రాడిని తోటలోకి తీసుకువెళ్లి కాల్చేస్తే పోలీసుల స్పందించలేదు. రేపటి రోజున ఆ దాష్టీకాలు మన ఇళ్లలోకి వస్తాయని హెచ్చరించారు.
గోదావరి జిల్లాల్లో ఎవరు అత్యధిక స్థానాలు గెలిస్తే వారే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆనవాయితగా వస్తోంది. 2014లో పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. గత ఎన్నికలలో అత్యధిక సీట్లు వైసీపీ గెల్చుకుంది. ఆ పార్టీలే ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఈ సారి పవన్ కల్యాణ్ .. తన పార్టీ స్ట్రాంగ్ గా ఉన్నది కూడా గోదావరి జిల్లాల్లోనే అనుకుంటున్నారు. అందుకే .. వైసీపీకి ఒక్క సీటు రాకుండా చేసి.. అధికారానికి దూరం చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నారని అంటున్నారు.