తనకు కులం మతం లేదనే పవన్ కల్యాణ్ … తొలి సారి తనకొక కులాన్ని అడాప్ట్ చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన పారిశుధ్య కార్మికులతో సమావేశం అయ్యారు. ఏ కులంలో పుడతావని భగవంతుడు అడిగితే రెల్లి కులంలో పుట్టాలని కోరుకుంటానని వారి ముందు ఆవేశంగా ప్రసంగించారు. రాజకీయాల్లో చెత్తను శుభ్రం చేసేందుకే వచ్చానని అందుకే తనది రెల్లి కులమని చెప్పుకొచ్చారు. ఈ రోజు నుంచి రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నానని ప్రకటించారు. మలమూత్రాలను చేత్తో ఎత్తే ప్రక్రియ ఇప్పటికీ కొనసాగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కులం కారణంగా రెల్లి కులం వారికి ఇళ్ళు అద్దెకి ఇవ్వడం లేదని తాను ముఖ్యమంత్రి అవ్వగానే పారిశుద్ధ్య కార్మికులకు గృహవసతి, పెన్షన్ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తనకు కులం ఆపాదించవద్దని పదే పదే చెప్పుకునే పవన్ కల్యాణ్… కేవలం తన సామాజికవర్గాన్ని నమ్ముకుని రాజకీయం చేస్తున్నారని కొంత కాలంగా ఇతర రాజకీయ పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఆయన తన రాజకీయ కార్యాచరణ తన సామాజికవర్గం ఉన్న జిల్లాల్లోనూ పెట్టుకున్నారు. నెలల తరబడి… అక్కడే తిరుగుతున్నారు. తరచూ ప్రసంగాల్లో కులాల గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ సారి ఏకంగా.. తనది ఈ రోజు నుంచి రెల్లి కులమని ప్రకటించుకున్నారు. పవన్ కల్యాణ్ తనను తాను రొటీన్ రాజకీయ నాయకుడిగా ప్రకటించుకునేందుకు ఇలాంటి ప్రకటనలతో తాపత్రయ పడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుల సంఘాల మీటింగ్ లలో ఇలాంటి ప్రకటనలు చేస్తూంటారు. ఓ సందర్భంలో.. మాదిగ సంఘాల సమావేశంలో పాల్గొని.. తాను పెద్ద మాదిగనని ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ఆయా కులాలను తనకు అన్వయించుకున్నారు. పవన్ కల్యాణ్ కూడా… తను చెప్పే కొత్త రాజకీయాన్ని పాత పద్దతుల్లోనే చేస్తున్నారు.
మరో వైపు ఉత్తరాంధ్ర టిట్లీ తుపాను బాధితులకు.. ఏపీ ప్రభుత్వం.. నేటి నుంచి నష్టపరిహారం పంపిణీ చేయడంపైనా విమర్శలు గుప్పించారు. తుఫాన్ బాధితుల చెక్ మీద చంద్రబాబు నవ్వుతూ ఉన్న ఫొటోఉందని.. అదృష్టవశాత్తు లోకేష్ బొమ్మ వేసుకోలేదని విమర్శించారు. బాధ్యతగా చేయాల్సిన పనికి పబ్లిసిటీ ఎందుకని ప్రశ్నించారు. నిజానికి… ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం.. నేరుగా తుపాను బాధితుల అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేస్తోంది. బాధితులకు ఎంత నష్టపరిహారం వచ్చిందో.. ఎంత బ్యాంక్ లో జమ చేశారో తెలుసుకునేందుకు చెక్ నమూనాలో… చంద్రబాబు బొమ్మతో.. ఓ రసీదు లాంటిది తయారు చేసి.. బాధితులకు ఇస్తున్నారు. వాటిని బ్యాంకులో వేయాల్సిన అవసరం లేదు. కానీ.. అవే నిజం చెక్కులను.. పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు.