ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే మాత్రమే పనులు జరుగుతాయనే ఆలోచనా విధానం తనకు లేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను పోరాటాన్నే నమ్ముతానీ, పదవి అనేది ఒక బాధ్యత అనీ, అదేదో అలంకారం కాదు కాబట్టే తాను ఎప్పుడూ మాట్లాడననీ, అది సహజసిద్ధంగా రావాలన్నారు పవన్. రాజకీయాలు డబ్బులతో ముడిపడిపోయాయనీ, ఒక నటుడై తాను రాజకీయాల్లోకి రావడమేంటని గర్వపడటం లేదన్నారు. తనవంతుగా సమస్యల్ని బయటకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటానన్నారు.
ప్రతీదానికీ పవన్ కల్యాణ్ రాలేడనీ, ఒక ఇంటర్మీడియట్ నాయకత్వం రావాలన్నారు. పవన్ కల్యాణ్ మీద ప్రేమతో రావద్దనీ, సమాజం మీద ప్రేమతో రాజకీయాల్లోకి రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అంటే పవన్ ని మరచిపోవాలనీ, పార్టీ ఆశయాలు మాత్రమే నిలబడాలన్నారు. వ్యవస్థలోకి కొత్త ఆలోచన రావాలనీ, ప్రస్తుతం రెండు పార్టీలే ఉన్నాయనీ, మూడో ప్రత్యామ్నాయం లేకపోతే న్యాయం జరిగే పరిస్థితి ఉండదన్నారు. ఈరోజున జనసేన ఉండటం వల్లనే జిల్లాల్లో అనేక సమస్యలు పరిష్కరించగలిగామన్నారు. పవన్ కల్యాణ్ తో 18 ఏళ్లు దాటినవారున్నారు, యువకులు ఉన్నారనే ఉద్దేశంతో ఓటరు జాబితా నుంచి పేర్లు తీసేసే కార్యక్రమం చేస్తారన్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అనే నినాదాలతో ఓట్లు రావన్నారు. దానికంటే ముందు కనీస బాధ్యతను తెలుసుకోవాలనీ, ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవడంపై యువత దృష్టిపెట్టాలని పవన్ కోరారు. కనీసం ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోనివారికి ప్రభుత్వాలను నిలదీసే హక్కు లేదన్నారు.
పార్టీలోకి వచ్చేవారు ఫ్లెక్సీలు పెట్టుకుని, జండాలు మోసేస్తే నాయకులు అయిపోతారని అనుకోవడం సరికాదన్నారు. పనిచేయకుండా ఎవ్వరూ నాయకులు కాలేరనీ, నిజంగా సేవ చేసేవాడు ఏవీ ఆశించరన్నారు. రాజకీయ పార్టీల్లోకి ఎవ్వరూ ఎవ్వర్నీ బొట్టు పెట్టి పిలవరనీ, ఇష్టముంటే పార్టీకి రండి అని వ్యాఖ్యానించారు పవన్. తనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశలేదనీ, ఇగోలని సంతృప్తిపరచాల్సిన అవసరం లేదన్నారు. అందరూ ఇగోస్ తగ్గించుకోవాలనీ, తన అభిమానులు కూడా కాస్త తగ్గాలనీ, కొత్తవారిని ఆహ్వానించండి అని కోరారు.