రాజకీయాల్లో తన బలంపై పవన్ కల్యాణ్ ఎట్టకేలకు గురి పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఆయన యువతను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఆయన ఇప్పుడు వారికిని ఏకతాటిపైకి తెచ్చేందుకు కార్యక్రమాలు చేపడుతున్నారు. ముందుగా శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరిట బహిరంగసభ నిర్వహిస్తున్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో ‘యువశక్తి ‘ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు ేశారు.
ఏపీలోని యువత తమ గళం వినిపించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని జనసేనాని చెప్పారు. రణస్థలం వేదికగా ఏర్పాటు చేస్తున్న యువశక్తి సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో రణస్థలంలో యువశక్తి తమ తడాఖా చూపించబోతోందన్నారు. ఈ సభకు యువతీయువకులు అందరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు.యువత తమ ఆలోచనల గురించి, వారి కష్టాల గురించి, వారి భవిష్యత్ గురించి గళం వినిపించేలా యువశక్తి కార్యక్రమం ఉండనుందని.. ఈ కార్యక్రమంలో తమ అభిప్రాయాలను యువత వినిపించవచ్చు అని తెలిపారు. మన యువత మన భవిత అని భావించి యువశక్తి సభలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పవన్ పిలుపునిచ్చారు.
పవన్ కల్యాణ్ ఎక్కడ సభ పెట్టినా వచ్చేది అత్యధిక భాగం యువతే. అయితే వీరిలో చాలా మంది సినీ ఫ్యాన్స్ ఉంటారు. వీరిపై రాజకీయ ప్రభావం తక్కువ. ఓటు వేసేటప్పుడు పవన్ ను పరిగణనలోకి తీసుకుంటారో లేదో క్లారిటీ ఉండదు. ఇలాంటి ఫాలోయర్లందర్నీ.. రాజకీయంగా ఉత్తేజితం చేసి.. జనసేనతోనే ఉండేలా చేసుకునేందుకు పవన్ ఇటీవలి కాలంలో ప్రయత్నం చేస్తున్నారు. వివేకానంద జయంతి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సభ కూడా ఆ కోవలోనిదేనని భావిస్తున్నారు.