ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతపైనే ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి మరీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నట్టుగా ఉంది. నేరుగా జగన్ పేరు ప్రస్థావించకపోయినా… ప్రతిపక్ష పార్టీ బాధ్యతను గుర్తుచేయడం, పదవుల వ్యామోహమే తప్ప ప్రజలు సమస్యలు పట్టవా అన్నట్టుగా వ్యాఖ్యానించడం చూస్తుంటే… పవన్ ఉద్దేశం ఏంటనేది అర్థమౌతుంది. రాజమండ్రిలో కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా చాలా అంశాలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రజారాజ్యం పార్టీ వైఫల్యానికి కారణాన్ని కూడా వివరించారు.
ముఖ్యమంత్రి కావడం కోసమే రాజకీయమా.. ప్రజలు కోసం పనిచేయాలన్న ఆలోచన ఉండదా అంటూ పవన్ ప్రశ్నించారు! చాలా సమస్యలు ఉన్నాయనీ, ముఖ్యమంత్రి అయితే తప్ప సమస్యలకు పరిష్కారం చూపలేమంటే ఎలా అనీ, అధికారం వచ్చేవరకూ వెయిట్ చెయ్యండని ప్రజలకు చెప్పడం తన మనస్సాక్షికి నచ్చని పని అని పవన్ చెప్పారు. తాను ఓసారి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్నప్పుడు.. అక్కడి ప్రజల తాగునీటి సమస్య చూసి చలించిపోయాననీ, వెంటనే తన మనుషుల్ని పంపించి ఒక బోరు వేయించానని అన్నారు. అభిమానులతో క్లాప్స్ కొట్టించుకోవడం కోసం ఇది చెప్పడం లేదన్నారు. ఒక సాధారణ వ్యక్తిగా ఇలాంటి పని తాను చేయగలిగినప్పుడు… ప్రతిపక్షంలో ఉన్నవారు అద్భుతాలు చెయ్యొచ్చు కదా అని పవన్ చెప్పడం విశేషం! చిత్తశుద్ధితో పనిచేస్తే ఎంతోమందికి మేలు చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వాలతో పని చేయించడం రాజకీయం అన్నారు. ‘అంతేగానీ, సమస్య వస్తే.. మీరు నన్ను ముఖ్యమంత్రిని చేయండి, ఆ తరువాత పరిష్కరిస్తా అంటే ఎలా..? నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యేది, మాకు ఎప్పుడు అన్నం పెడతావు’ అంటూ ప్రశ్నించారు.
పరకాల ప్రభాకర్ పై పవన్ కల్యాణ్ మరోసారి విమర్శలు చేశారు. ‘ప్రజారాజ్యంలో ఉండగా కోపం వచ్చిందని కస్సున లేచిపోయారే, ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నార’ని ప్రశ్నించారు. ‘మీ సతీమణి కేంద్రమంత్రిగా ఉన్నారు కదా.. ప్రత్యేక హోదా గురించి ఢిల్లీలో మాట్లాడొచ్చు కదా’ అన్నారు. ‘మీరు చూపించే దమ్మూ తెగింపూ సమానంగా ఉండాలనీ, చిరంజీవికి ఒకలా… మోడీకి మరోలా ఉండకూడద’న్నారు. పోలవరం గురించి మాట్లాడుతూ… ఆ ప్రాజెక్టు గురించి అర్థం చేసుకునేంత ఓపిక నాయకులకు లేకుండా పోయిందన్నారు. కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ… ఓసారి ముఖ్యమంత్రి ఇదే విషయమై తనతో చెప్పారనీ, కొంత చర్చించాలని తాను అంటే, ఫర్వాలేదూ రిజర్వేషన్లు ఇచ్చెయ్యొచ్చని ఆయన అన్నారన్నారు. ఇచ్చిన మాటను నెరవేర్చకపోవడం వల్లనే తుని వంటి ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతీ అంశాన్ని తప్పక నెరవేర్చాల్సి ఉంటుందన్నారు. ఈరోజు కాపు రిజర్వేషన్లు పెట్టామని తెలుగుదేశం పార్టీ అంటున్నా… 17 శాతం అనుకున్నప్పుడు నాలుగు శాతం, ఐదు శాతం ఇవ్వడమేంటని ప్రశ్నించారు. దానికి బదులుగా ఇవ్వకుండా ఉండాల్సిందనీ, విందు భోజనం పెడతానని చెప్పి… నోటికి ఆవకాయ బద్ద రాస్తే ఏం నచ్చుతుందని ఎద్దేవా చేశారు. కులం, మతం అనేది ఒక భ్రమ మాత్రమే అన్నారు. అలాగైతే, ఉత్తరప్రదేశ్ లో భాజపాకి ముస్లింలు ఓట్లేసి గెలిపించారు కదా… దాన్నేమనాలి అన్నారు.
ఇలా రాష్ట్రంలోని కీలక అంశాలను టచ్ చేస్తూనే పవన్ ప్రసంగం సాగింది. అయితే, ఆయన ప్రసంగంలో ప్రతిపక్ష పార్టీ పాత్రను దుమ్మెత్తి పోసేందుకే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. నిన్నటి వైజాగ్ సభలో కూడా పవన్ కల్యాణ్ ఇదే తరహాలో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకోవడం కూడా విశేషమే! మరి, రేపు కూడా ఇదే ట్రెండ్ కొనసాగిస్తారేమో చూడాలి..!