తెలుగు మీడియాలో కొన్ని వర్గాలు పక్షపాత వైఖరితో వ్యవహరించే సంగతి తెలిసిందే. జనసేన పార్టీ విషయంలో , ఎన్నికలకు ముందు తెలుగు మీడియా, ప్రత్యేకించి టీవీ మీడియా వ్యవహరించిన తీరును చాలామంది ఆక్షేపించారు. పవన్ కళ్యాణ్ సభలకి లక్షలాది మంది జనాలు తరలి వచ్చినా, పవన్ కళ్యాణ్ ఏరి కోరి నీతివంతులైన అభ్యర్థులను దాదాపు 90 శాతం స్థానాలలో పోటీ కి నిలబెట్టినా కనీసం దాని గురించి కొన్ని ప్రధాన చానల్స్ స్క్రోలింగ్ కూడా ఇవ్వకుండా వ్యవహరించిన తీరును అప్పట్లో జనసైనికులు తప్పుపట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సుతిమెత్తగా అటువంటి మీడియా వర్గాలకు వాత పెట్టారు.
జనసేన పార్టీ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పేరుమీద విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, “ఎక్కడో హాంగ్ కాంగ్ లో 10 లక్షల మంది రోడ్డెక్కితే అది ప్రపంచవ్యాప్తంగా వార్త అయింది. కానీ మనకు ఇక్కడ రాజమండ్రిలో 10 లక్షల మంది కవాతుకు వస్తే జాతీయస్థాయి వార్త కాదు కదా కనీసం పక్క వారికి కూడా తెలియలేదు. 10 లక్షల మంది రోడ్డు మీదకు వస్తే, వీరు గెలవకూడదు అని అందరూ కోరుకున్నారు తప్ప వీరికి ఏం కావాలి అని ఎవరు ఆలోచించలేదు. అది నన్ను బాధించింది” అని పేర్కొన్నారు.
అంతేకాకుండా, కవాతు ముగిసిన రాత్రి శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ వస్తే తాము రాజమండ్రి నుండి శ్రీకాకుళం వెళ్లామని కానీ అప్పట్లో పాదయాత్ర చేస్తూ శ్రీకాకుళం పక్కనే విజయనగరం జిల్లాలో ఉన్న జగన్ శ్రీకాకుళం వెళ్లలేదని, సమస్యలపై ప్రతిస్పందించే తీరు లో తమకు జగన్ కి ఉన్న తేడా అదే అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా, కవాతు సందర్భంగా దాదాపు 10 లక్షలమంది తరలి వచ్చినప్పటికీ, తెలుగు మీడియా ఆ సంఘటనను ప్రజలకు తెలియనివ్వకుండా చేయడం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని చాలామంది ప్రజలు భావిస్తున్నారు.