జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఇటీవలి కాలంలో.. చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్‌ను ప్రథమ శతృవుగా పరిగణిస్తున్నారు. నాలుగో ఆవిర్భావ దినోత్సవ సభలో… శేఖర్ రెడ్డితో లోకేష్‌కు సంబంధాలు అంటగట్టినప్పటి నుంచి… పవన్ కల్యాణ్‌ది అదే వరుస. అందరూ అనుకుంటున్నారంటూ.. లోకేష్‌పై వరుసగా అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. చివరికి శ్రీరెడ్డి అనే నటీమణి పవన్ కల్యాణ్‌ను తిట్టినప్పుడు.. మీడియాలో వచ్చిన హైప్‌కి కూడా.. లోకేషేనని పవన్ కల్యాణ్ తేల్చారు. పవన్ మిత్రబృందం పేర్లు చెప్పి.. వీరంతా.. తనను డీఫేమ్ చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించేశారు. ఆ మెత్తం ఎపిసోడ్లో లోకేష్‌కి…మీడియాకు సంబంధం అంగట్టేశారు.
పవన్ కల్యాణ్ తనను టార్గెట్ చేసుకున్నా… మంత్రి నారా లోకేష్ మాత్రం ఎప్పుడూ మాట తూలలేదు. పవన్ కల్యాణ్ ఎవరో చెప్పిన మాటలు విని.. విమర్శిస్తున్నారని..నిజాలు తెలుసుకోవాలని.. సూచనలు చేస్తూ వస్తున్నారు. లోకేష్ ఎంత సాఫ్ట్‌గా స్పందిస్తూంటే పవన్ అంత సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. నిన్న మళ్లీ..లోకేష్‌కు సవాల్ చేశారు. దమ్ముంటే.. మంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ చేశారు. నిజానికి ఇప్పుడు లోకేష్ పవన్ కల్యాణ్‌పై ఎలాంటి విమర్శలు చేయలేదు. విశాక ప్రత్యేకహోదా నిరసన యాత్రలో… పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు..లోకేష్ ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు. విభజన హామీల అమలు కోసం.. కేంద్రంపై పోరాడుతున్నది తామేనని గుర్తించాలన్నారు. దీనికే పవన్ కల్యాణ్… తన ఆవేశం మొత్తాన్ని..రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలనే సవాల్ దగ్గరకు తీసుకెళ్లారు.
అసలు లోకేష్‌కు, పవన్‌కు ఎక్కడ చెడిందన్న విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. కానీ.. పవన్ కల్యాణ్ ప్రసంగాల్లో మాత్రం.. దానికి సంబంధించిన సూచనలు మాత్రం కనిపిస్తూంటాయి. అప్పుడప్పుడు.. లోకేష్ రాజకీయ వారసత్వాన్ని పవన్ కల్యాణ్ విమర్శిస్తూంటారు. విశాఖ సభలోనే.. “ముఖ్యమంత్రుల కొడుకులు.. ముఖ్యమంత్రులు అయితే.. వారితో మేము తొక్కించుకోవాలా” అంటూ ఘాటు విమర్శలు చేశారు. అంటే పవన్ కల్యాణ్ మాటలను బట్టి.. లోకేష్… వారసత్వంతో పైకి వస్తున్నాడన్న ఆగ్రహంతో అలాంటి విమర్శలు చేసి ఉంటారని భావిస్తున్నారు.
నిజానికి రాజకీయాల్లో వారసత్వం విషయంలో పవన్ కల్యాణ్ భయపడాల్సిందేమీ లేదు. ఎందుకంటే.. సినిమాల్లో అయితే.. తమకు కావాల్సిన వాళ్లను.. కుటుంబసభ్యులను హీరోలుగా పెట్టి.. హిట్ వచ్చే వరకూ సినిమాలు తీసి ఎలాగోలా నిలబెట్టవచ్చు. రాజకీయాల్లో అది సాధ్యం కాదు.. జలగం వెంగళరావు నుంచి … కోట్ల విజయభాస్కరరెడ్డి వరకు.. ఎంతో మంది ముఖ్యమంత్రులు తమ కొడుకుల్ని ముఖ్యమంత్రుల్ని చేయలేకపోయారు. కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలవని వారసులు కూడా ఎందరో ఉన్నారు. రాజకీయాల్లో ప్రజామోదం ఉండాలి. అది ఉంటే.. వారసత్వం అనేది విమర్శలకే పరిమితమవుతుంది. బయటవాళ్లను ఇండస్ట్రీలోకి రానివ్వకుండా.. తమ వాళ్లతోనే సినిమాలు తీసి.. తప్పనిసరిగా సినిమాలు చూసే పరిస్థితి రాజకీయాల్లో ఉండదు. ఇదే కారణం అయితే.. లోకేష్‌పై ద్వేషాన్ని పవన్ కల్యాణ్ తగ్గించుకోవచ్చు..
———-సుభాష్