పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్ర ఈ రోజు రాయలసీమలో కి ప్రవేశించింది. అనంతపురంలో జనసేన కవాతు కి భారీ స్పందన వచ్చింది. ఎప్పటిలాగానే చంద్రబాబు ని, లోకేష్ ని, జగన్ ని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ అనంతపురం సభలో జే.సి ప్రభాకర్ రెడ్డి ని ప్రత్యేకంగా టార్గెట్ చేశారు.
జెసి ప్రభాకర్ రెడ్డి ని టార్గెట్ చేసి మాట్లాడుతూ, పాతకాలం ఫ్యాక్షన్ రాజకీయాలకు కాలం చెల్లింది అన్న విషయాన్ని జేసీ అర్థం చేసుకోవాలని, ప్రస్తుత యువతరానికి ఫ్యాక్షన్ రాజకీయాలు అంటే భయం లేదని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. ఈ విషయంలో తనకు కాన్షీరామ్ స్ఫూర్తి అని చెప్పిన పవన్ కళ్యాణ్, కాన్షీరామ్ పార్టీ ప్రారంభించిన కొత్తలో ఉత్తరప్రదేశ్లో వీధికొక గుండా ఉండేవాడని, వీరంతా కాన్షీరామ్ ని అణగదొక్కడానికి ఎంత ప్రయత్నించినా, ఆయన వీటన్నింటికీ ఎదురొడ్డి నిలబడ్డారు అని పవన్ కళ్యాణ్ అన్నారు.
అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగాల శైలి గమనించిన వాళ్లకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఒక్కొక్క సందర్భంలో , ప్రజల్లో కాస్తంత నెగటివ్ ఇమేజ్ ఉన్న ఒక స్థానిక నాయకుని ఎన్నుకుంటాడు. వారి గురించి పూర్తి చిట్టా తన దగ్గర పెట్టుకొని ఉద్దేశ్యపూర్వకంగా వారిని బలంగా టార్గెట్ చేసి మాట్లాడతాడు. ఒకవేళ వాళ్ళు దీనికి ప్రతిస్పందిస్తే మరింత బలంగా వారిని టార్గెట్ చేస్తాడు. వారి మీద ఉన్న నెగటివ్ ఇమేజ్ కారణంగా ఈ మాటల యుద్ధం పవన్ కళ్యాణ్ కి బాగా మైలేజ్ తీసుకొని వస్తుంది. ఉత్తరాంధ్రలో ఉన్నప్పుడు గౌతు శిరీష ని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్, పశ్చిమగోదావరిలో చింతమనేని ప్రభాకర్ ఇదేవిధంగా బలం గా టార్గెట్ చేశాడు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు ని ఇలాగే టార్గెట్ చేశాడు. ఇప్పుడు ఇదే కోవలో జెసి ప్రభాకర రెడ్డిని టార్గెట్ చేశారు. జాగ్రత్తగా గమనిస్తే పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా తన టార్గెట్ లని ఎన్నుకున్నట్లు అర్థమవుతుంది. ఎన్నికల్లో గెలుస్తున్నప్పటకీ , ప్రజల్లో నెగెటివ్ ఇమేజ్ కలిగిన నాయకులను పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యపూర్వకంగా ఎంచుకుంటున్నాడు. ఇంకా జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపించకుండా ఒక్కొక్క చోట ఒక సామాజిక వర్గానికి చెందిన ఇలాంటి నాయకులను ఎంచుకుంటూ ఉంటున్నాడు.
అయితే ఈ స్ట్రాటజీలు ఎంతవరకు ఫలిస్తాయన్నది ఎన్నికలు వచ్చాక తెలుస్తుంది.