పవన్ – హరీష్ శంకర్.. ‘భవదీయుడు భగత్ సింగ్’..
ఈ కాంబోకీ, ఆ పేరుకీ వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే వీరిద్దరి ‘గబ్బర్ సింగ్’ బాక్సాఫీసుని షేక్ చేసేసింది. మళ్లీ పవన్‌ని అంత మాసీగా చూడలేకపోయారు అభిమానులు. ‘భవదీయుడు…’తో ఆ లోటు తీరుతుందనుకుంటే.. ఆ సినిమా ప్రకటించారు కానీ, ఇప్పటి వరకూ అత్తా పత్తా లేదు.
భవదీయుడుని పక్కన పెట్టి వకీల్ సాబ్ పూర్తి చేశాడు పవన్.
భవదీయుడుని పక్కన పెట్టి సముద్రఖనికి మాటిచ్చాడు పవన్.
భవదీయుడుని పక్కన పెట్టి ఇప్పుడు సుజిత్‌ని లైన్లోకి తీసుకొచ్చాడు పవన్.
ఓరకంగా ఇది హరీష్ శంకర్ సహనాన్ని పవన్ పరీక్షించడమే. పవన్ అంటే హరీష్‌కు చాలా ఇష్టం. గౌరవం. అందుకే పవన్ లేట్ చేస్తున్నా, సహనంతో నిరీక్షిస్తున్నాడు. `కొన్ని సార్లు రావడం లేట్ అవ్వొచ్చేమో గానీ…. రావడం మాత్రం పక్కా` అని అభిమానులకు ధైర్యం, నమ్మకం నూరిపోస్తున్నాడు హరీష్. ఎంత ధైర్యవచనాలు చెప్పుకొన్నా, పవన్ అంటే ఎంత అభిమానం ఉన్నా – పవన్ ఇలా ఏళ్లకు ఏళ్లు నిరీక్షణలో పడేయడం ముమ్మాటికీ పవన్ తప్పే. నిజానికి.. పవన్ – హరీష్ కాంబోకి ఉన్న క్రేజ్.. పవన్ – సముద్రఖని, పవన్ – సుజిత్ కాంబోలకు లేదు. పైగా… హరీష్ ది ఒర్జినల్ కథ. మిగిలినవి రీమేకులు. అలాంటప్పుడు పవన్ హరీష్ సినిమాని పట్టాలెక్కించడమే న్యాయం. పవన్ నుంచి మరో రీమేక్ చూడ్డానికి అభిమానులు సిద్ధంగా ఉంటే ఉండొచ్చు. కానీ వాళ్లకు కిక్ ఇచ్చేది మాత్రం పవన్ ని ఒర్జినల్ స్టోరీలో చూడడమే. హరీష్ చెప్పిన కథ నచ్చలేదా, అందులో మార్పులు చేర్పులూ ఉన్నాయా అంటే అదీ లేదు. డైలాగులతో సహా పవన్‌కి స్క్రిప్టు వినిపించి ఓకే చేయించుకొన్నాడు హరీష్. అలాంటప్పుడు ఈ వెయిటింగ్ ఎందుకో…. ఎవరికీ అంతు పట్టని విషయం. సుజిత్ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేస్తే.. పవన్ విషయంలో హరీష్ తనకు తాను తప్పుకోవడం ఖాయంగా అనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.