2019 అసెంబ్లీ ఎన్నికల్లో.. రెండు చోట్లా పోటీ చేస్తే రెండూ ఓడిపోయాడు పవన్ కల్యాణ్. గెలిచిన ఒకే ఒక్క సీటు కూడా వైసీపీ పక్షాన చేరింది. ఇక జనసేన ఖేల్ ఖతం అన్నారంతా. పవన్‌ని ఎద్దేవా చేయని వైసీపీ నాయకుడు లేడు. జగన్ అయితే పవన్ కల్యాణ్ పేరుని ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడలేదు. ఒక్క సీటు కూడా లేకుండా, కనీసం అధినేత గెలవకుండా ఐదేళ్ల పాటు రాజకీయాల్ని నడిపించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. 2024 ఎన్నికల వరకూ ఈ పార్టీ ఉంటుందా, ఊడుతుందా అనే అనుమానాల మధ్య… ఐదేళ్ల పాటు నిలబడడమే కాకుండా, ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పి, పోటీ చేసిన 21 స్థానాల్లో 20 స్థానాలు గెలిచి, వైసీపీని మట్టికరిపించి, రియల్ గేమ్ ఛేంజర్ అవతారం ఎత్తిన జనసేన పార్టీ ప్రస్థానం.. అనిర్వచనీయం, అనితర సాధ్యం.
‘గుర్తు పెట్టుకో జగన్… నిన్నూ నీ పార్టీనీ భూస్థాపితం చేయకపోతే నా పేరు పవన్ కల్యాణే కాదు, నాది జనసేన పార్టీనే కాదు’ అని తొడగొట్టినప్పుడు పవన్‌లో ఆవేశం మాత్రమే కనిపించింది. ఓ నికార్సయిన హీరోలానే ప్రగల్భాలు పలుకుతున్నాడే అనుకొన్నారంతా. కానీ పవన్ చేసి చూపించాడు. ఇప్పుడు వైసీపీ నామరూపాలు లేకుండా పోయిందంటే, ఆ క్రెడిట్ కచ్చితంగా పవన్ కల్యాణ్‌దే. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నుంచి ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఆ క్షణం.. ‘పొత్తు’ రాజకీయాలతో టీడీపీకి బేషరతుగా మద్దతు పలికాడు పవన్. ఈరోజు నుంచే గాలులన్నీ కూటమి వైపు మళ్లాయి. ఆ ఫలితం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. పిఠాపురంలో పవన్ భారీ మెజార్టీతో గెలవడమే కాదు. ఏకంగా 20 స్థానాల్లో తన అభ్యర్థుల్ని గెలిపించాడు. టీడీపీ విజయంలో పరోక్షంగా, ప్రత్యక్షంగా తన పాత్ర పోషించాడు. భాజాపాని పొత్తులోకి లాక్కురావడం, భాజాపా కోసం కొన్ని సీట్లు త్యాగం చేయడం ఇవన్నీ పవన్ నిస్పక్షపాత రాజకీయాలకు అద్దం పట్టాయి. కేవలం 21 సీట్లేనా అది ఎద్దేవా చేసినవాళ్లకు పవన్ ఇప్పుడు సమాధానం చెప్పాడు.
ఎన్ని సీట్లలో పోటీ చేశామన్నది కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేశామా, లేదా అనేదే ముఖ్యం అని చెప్పిన పవన్.. ఇప్పుడు తన త్యాగాలకు తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి పవన్ చేసిన త్యాగాలు ఇప్పుడు సత్ఫలితాలు ఇచ్చాయి. తాను గెలవడమే కాదు. టీడీపీనీ, బీజేపీని గెలిపించడానికి పవన్ తీసుకొన్న నిర్ణయాలు ఇతోదికంగా సాయం చేశాయి. వైకాపాకు కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేయడంలో పవన్ తీసుకొన్న నిర్ణయాలు బలంగా పనిచేశాయి. ఇప్పుడు అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ పవన్‌వే. ఇవి చాలవూ.. పవన్‌ని గేమ్ ఛేంజర్ అని చెప్పడానికి.పవన్‌ని అభిమానులంతా `పవర్ స్టార్` అని పిలుస్తారు. ఆ పిలుపు పవన్‌కు నచ్చదు. పవర్లోకి వచ్చినప్పుడు అలా పిలవండి అని తరచూ చెప్పేవాడు పవన్. ఇప్పుడు పవన్ అనే పేరు ముందు ‘పవర్ స్టార్’ అనే అక్షరాలు చేరిపోవడానికి ముచ్చటపడతాయి. ఆ బిరుదుకు పవన్ అక్షరాలా అర్హుడు.