జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో జనసేన పార్టీ కన్నా.. బీజేపీ గురించే ఎక్కువ ట్వీట్లు.. ప్రకటనలు చేస్తున్న ఆయనను గరిష్టంగా ఉపయోగించుకోవాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరుగుతున్నాయి . బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. గతంలోనూ ఆయన అక్కడ పోటీ చేశారు. గ్రామగ్రామన ఆయన అనుచరణగణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గెలుపు అవకాశాలు ఉన్నాయని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు.
ఇప్పటికే తెలంగాణకు చెందిన ముఖ్యనేతలతా దుబ్బాకపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వ్యూహాలు రచిస్తున్నారు. ఆరెస్సెస్ వర్గాలు కూడా రంగంలోకి దిగాయి. ప్రచారానికి ఊపు రావాలంటే… ఓ సూపర్ స్టార్ వస్తే బాగుటుందని అంచనా వేస్తున్నారు. ఆ సూపర్ స్టార్ పవన్ కల్యాణ్ అయితే బాగుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ దిశగా పవన్ కల్యాణ్‌ను ఒప్పించేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత బండి సంజయ్… పవన్ కల్యాణ్ ను కలిశారు. కలిసి పని చేస్తామని ప్రకటించారు. పవన్ సేవల్ని ఉపయోగించుకుంటామని అప్పుడే చెప్పారు.
దీనికి తగ్గట్లుగా ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ కూడా.. ఖాళీగానే ఉన్నారు. ఆయన సినిమాల షూటింగ్‌లు ఇంకా ప్రారంభం కాలేదు. ఒకటి లేదా రెండు రోజుల సమయం కేటాయించినా చాలని తెలంగాణ బీజేపీ నేతలు పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఢిల్లీ పెద్దలు ఓ మాట చెబితే పవన్ ప్రచారానికి వెళ్లడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు దుబ్బాక ప్రచారానికి వెళ్తే తర్వాత గ్రేటర్ ఎన్నికల్లోనూ పవన్ జోరు ప్రచారాన్ని చూడొచ్చని భావిస్తున్నారు.