జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024 ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే టీడీపీతో పొత్తుతో ఫామ్లో ఉన్న జనసేనను జెట్ స్పీడ్తో ప్రజలకు దూసుకెళ్లేలా వ్యూహరచన చేయబోతున్నారు. జనసేన పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసేందుకు పూర్తి సమయం వెచ్చించనున్నారు. మార్చిలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అందుకే పవన్ కల్యాణ్ ఇక ఫుల్ టైమ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సినిమా షూటింగ్లకు విరామం ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ దర్శక నిర్మాతలకు సమాచారం ఇచ్చారు. క్యాడర్ను సైతం సమాయత్తం చేసేందుకు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసేందుకు పవన్ కల్యాణ్ రెడీ అవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 1న పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమాయత్తం చేయనున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించాలి అనేదానిపై దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా ఎలాంటి విధి విధానాలను అనుసరించాలి అనే అంశాలపై పార్టీ నేతలతో చర్చించి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తారని తెలుస్తోంది. అలాగే వారాహి విజయయాత్రకు సంబంధించి మలివిడత ఎక్కడ నుంచి ప్రారంభించాలి అనేదానిపై కూడా ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓటర్ల జాబితాలో అక్రమాలు, వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.