జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జనంలోకి వెళ్లబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈ పర్యటన మూడు దశల్లో ఉంటుందని ఒక ప్రకటనలో వివరించారు. తొలి విడత పర్యటనలో సమస్యలపై అధ్యయనం, పరిశీలన, అవగాహన ఉంటుందన్నారు. రెండో విడత పర్యటనలో ఆయా సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వ బాధ్యతను ప్రశ్నిస్తారు. ఇక, మూడో దశలో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తీరు సరిగా లేకపోతే పోరాటానికి సిద్ధం అవుతారు. ఇకపై తాను పూర్తి స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టబోతున్నట్టు పవన్ చెప్పకనే చెప్పినట్టే. ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమా పనులు కూడా పూర్తయ్యాయి. కాబట్టి, ఇకపై రాజకీయాలపైనే పవన్ పూర్తిగా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.
ఇక, ఏపీ పర్యటన విషయానికొస్తే.. 6వ తేదీన విశాఖకు పవన్ విమానంలో వస్తారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇండియా ఉద్యోగులను కలుస్తారు. వారు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వబోతున్నారు. గురువారం నాడు పవన్ కల్యాణ్ రాజమండ్రి వెళ్తారు. అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. ఆ మర్నాడు, అంటే శుక్రవారం నాడు విజయవాడకు చేరుకుంటారు. ఫాతిమా కాలేజ్ విద్యార్థులతో సమావేశమై, వారి సమస్యల గురించి మాట్లాడతారు. ఆ మర్నాడు, అంటే శనివారం మంగళగిరిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్న స్థలానికి వెళ్తారు. ఆ తరువాత, ఇటీవలే బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను పరామర్శిస్తారు. ఇదీ పవన్ కల్యాణ్ టూర్ షెడ్యూల్.
ఇవే అంశాలపై తన అభిప్రాయాలను పవన్ తన ట్విట్టర్ లో పంచుకున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న తనను కృష్ణా నదిలో పడవ ప్రమాదం కలచివేసిందన్నారు. భాజపా సర్కారు తీసుకున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ నిర్ణయం కారణంగా వెంకటేష్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. అందుకే, రేపే ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నాను అన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని యువత నిరాశ, నిస్ప్రుహలతో ఉన్నారనీ, ఇది దేశ ప్రగతికి మంచిది కాదని పవన్ అభిప్రాయపడ్డారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులు ఆవేదనతో ఉన్నారనీ, వారి సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పవన్ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి మురళీ ఆత్మహత్యపై కూడా పవన్ స్పందించారు. ప్రస్తుతం పోలీసు ఆంక్షలు ఉన్నాయి కాబట్టి నేరుగా మురళీ కుటుంబాన్ని కలుసుకోలేకపోతున్నాననీ, అతడి సోదరుడితో మాట్లాడాననీ, ఆంక్షలు సడలించిన తరువాత నేరుగా వెళ్లి, ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని పవన్ ట్వీట్ లో చెప్పారు.
సో.. ప్రస్తుతం ఏపీలో ప్రముఖంగా చర్చనీయం అవుతున్న అంశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ పవన్ తన టూర్ ప్లాన్ చేసుకోవడం విశేషం. ఆంధ్రాతోపాటు తెలంగాణలో కూడా పవన్ పర్యటించబోతున్నట్టు ప్రకటించడం ద్వారా, జనసేనకు రెండు తెలుగు రాష్ట్రాలూ సమానమే అనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. మూడు విడతల్లో తన పర్యటనలు ఉంటాయని చక్కని ప్రణాళికను ప్రకటించారనే చెప్పాలి. సమస్యల అధ్యయనం, ప్రభుత్వానికి బాధ్యతలు గుర్తుచేయడం, పోరాటం.. మరి, ఆ మూడు దశల్ని అనుకున్నట్టుగా అమలు చేయడంలో జనసేనాని ఎంతవరకూ విజయవంతం అవుతారో వేచి చూడాలి.