జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ వ్యూహం మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఒక్క చాన్స్ ఇవ్వమని ప్రజల్ని కోరుతున్నారు. వైసీపీని తామే గట్టిగా ఎదుర్కొంటున్నామన్నారు. అన్ని చోట్లా అభ్యర్థుల్ని పెడతానని.. ఎవరైనా అడ్డుకుంటే సంగతి చూస్తానని హెచ్చరిస్తున్నారు. నిన్నటిదాకా ఆయన ఓట్లు చీల్చబోనని అన్న ప్రకటనలకు.. ఇప్పుడు చేస్తున్న ప్రకటనలకు చాలా తేడా ఉంది. ప్రధానమంత్రి మోదీతో భేటీ జరిగిన మూడు రోజుల తర్వాత పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. వీరుడు.. ధీరుడు అని దేశాన్ని క్లిష్టపరిస్థితుల నుంచి కాపాడుతున్నారని అభినందించారు.
అదే సమయంలో పరోక్షంగా టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. వైసీపీని ఎదుర్కొలేకపోతోందని.. గతంలో అనుభవం పేరుతో చంద్రబాబుకూ చాన్సిచ్చారని.. ఈ సారి తనకివ్వాలన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. మోదీతో భేటీ తర్వాత పవన్ మాట తీరులో మార్పు వచ్చిందా లేకపోతే.. ఇంకేదైనా రాజకీయ వ్యూహమా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత ఘటనపై పోరాటం తర్వాత ప్రజలు ప్రత్యామ్నాయంగా జనసైన వైపు చూస్తారని.. అవకాశం ఇస్తారని భావిస్తున్నారని అంటున్నారు.
అదే సమయంలో ఆయన బీజేపీ ప్రస్తావన కూడా తీసుకు రావడం లేదు. తానే సొంతంగా పోటీ చేయాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. పొత్తుల గురించి మాట్లాడటం లేదు. గతంలో చంద్రబాబునాయుడు విశాఖ ఘటనపై సంఘిభావం తెలిపినప్పుడు వైసీపీ సర్కార్ను కూలదోయడం కోసం కలిసి పని చేస్తామని ప్రకటించారు. అప్పుడు కూడా కలిసి పోటీ చేయడంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు కానీ ఏపీ బీజేపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం.. వ్యూహం మార్చుకుంటున్నానని చెప్పడం ద్వారా పవన్ విధానంలో మార్పు వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.