పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక నుంచి పవన్ కల్యాణ్ అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు ఆయనకు జనసేన అత్యున్నత నిర్ణాయక కమిటీ స్థానాలను ఖరారు చేసింది. పవన్ పోటీ చేయడానికి కమిటీ మొత్తం ఎనిమిది స్థానాలు పరిశీలించింది. అనంతపురం, తిరుపతి, రాజానగరం, పిఠాపురం, భీమవరం, గాజువాక, పెందుర్తి, ఇచ్ఛాపురం స్థానాల్లో… పవన్ పోటీ ఏలా ఉంటుందో .. సర్వేచేసింది. అన్ని పరిస్థితులను అంచనా వేసి చివరికి రెండు స్థానాలను ఎంపిక చేసింది. పవన్‌కల్యాణ్ గాజువాక నుంచి పోటీ చేస్తారని తొలి నుంచీ ప్రచారం జరిగింది. భీమవరం పేరు మాత్రం అనూహ్యంగా తెరపైకి వచ్చింది. పవన్ రాయలసీమ నుంచి పోటీ చేస్తారని మొదట భావించారు. కానీ రెండు చోట్ల పోటీ చేస్తున్నా.. ఒక్కటి కూడా రాయలసీమ జోలికి వెళ్లలేదు.
గతంలో ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించినప్పుడు కూడా.. చిరంజీవి రెండు చోట్ల పోటీ చేశారు. పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీ చేశారు. తిరుపతిలో గెలిచి పాలకొల్లులో ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ నాటి ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే… రెండు స్థానాలు.. పవన్ కల్యాణ్ కు బలమైనవిగానే భావింవచ్చు. భీమవరంలో పవన్ కల్యాణ్ సామాజికవర్గం వారు ఎక్కువగా ఉంటారు. అప్పట్లో పీఆర్పీ తరపున పోటీ చేసిన అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. గాజువాకలో చింతలపూడి వెంకట్రామయ్య.. భారీ మెజార్టీతో పీఆర్పీ తరపున విజయం సాధించారు. ఈ కోణంలో.. పవన్ కల్యాణ్ రెండు సీట్లను .. సేఫ్ జోన్ లో ఉన్న వాటినే ఎంపిక చేసుకున్నట్లుగా భావించవచ్చు.
అయితే.. ఏ పార్టీ అయినా విజయం సాధించాలంటే.. ఇప్పుడు.. క్యాడర్ చాలా ముఖ్యం. మద్దతుదారులైన ఓటర్లను పోలింగ్ బూత్ వరకూ తెప్పించుకోవడం చాలా ముఖ్యం. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి కొంత క్రేజ్ వచ్చింది. దాదాపుగా ప్రతి నియోజకవర్గం నుంచి క్యాడర్ ఇతర పార్టీల నుంచి వచ్చి చేరింది. కానీ జనసేన విషయంలో అదేమీ లేదు. కేవలం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే నడిపిస్తున్నారు. రాజకీయ ఆశలతోవచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోతున్నారు. అందుకే పవన్ కల్యాణ్ రెండు స్థానాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్నికల మేనేజ్ మెంట్ చేసుకోవాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.