మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్ కాకినాడలో బస చేసి పార్టీ వ్యవహారాలపై సమీక్ష చేయనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పొత్తుల్లో భాగంగా జనసేనకు కాస్త ఎక్కువ సీట్లు లభిస్తాయి. బలం ఉన్న చోటే పోటీ చేస్తామని పవన్ చెప్పారు. అందుకే అన్ని రకాల సర్వేలు ఇతర నివేదికల ఆధారంగా పోటీ చేసే నియోజకవర్గాలపై ఓ స్పష్టతకు వచ్చిన పవన్ కల్యాణ్.. క్యాడర్ ను రెడీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
పవన్ పోటీ చేసే స్థానంపై స్పష్టత లేదు. కానీ ఆయన ఈ సారి కాకినాడ సిటీ నుంచి పోటీ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. ఈ సారి తన గెలుపు ఓ రేంజ్ లో ఉండాలని అనుకుంటున్నారు. అదీ కూడా తనతో సవాల్ చేసిన వ్యక్తి.. తాను సవాల్ చేసిన వ్యక్తిపైనే ఉండాలనుకుంటున్నారు. కాకినాడ సిటీ నుంచి జగన్ రెడ్డి నమ్మిన బంటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పవన్ పై గతంలో బూతులతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో చాలెంజ్ కూడా చేశారు. కానీ వాళ్లు చాలెంజ్ చేసినప్పుడు స్పందిస్తే… వారి ట్రాప్ లో పడినట్లవుతుంది. అందుకే పవన్ వ్యూహాత్మక మౌనం పాటించారు.
ఇప్పుడు అన్ని రకాల సర్వే నివేదికలను పరిశీలించిన తర్వాత పవన్ పోటీ చేస్తే కనీసం యాభై వేల మెజార్టీ వస్తుందని తేలడంతో… కాకినాడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే పవన్ మూడు రోజుల పాటు ప్రత్యేకంగా కాకినాడలో మకాం వేస్తున్నారని అంటున్నారు. ద్వారంపూడిని శంకరగిరి మన్యాలకు పంపిస్తే.. జగన్ రెడ్డిని పంపించినట్లేనని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అది పవన్ చేసి చూపిస్తారంటున్నారు.