జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనంతపురంలో మరో టీజర్ వదిలారు. అది తను పోటీ చేయబోయే అసెంబ్లీ స్థానం గురించి. గతంలో అనంతపురం జిల్లాలో పర్యటించినప్పుడు.. అక్కడి కరువు పరిస్థితులకు చలించిపోయి.. ఉబికి వచ్చే కన్నీటిని ఆపుకుని.. అక్కడి రైతులను ఆదుకోవడానికి అక్కడ పోటీ చేస్తానని ప్రకటించారు. అవసరమైతే పాదయాత్ర చేస్తానన్నారు. ఆ తర్వాత దాదాపుగా ఎడెనిమిది నెలలకు మళ్లీ ఓ సారి పార్టీ కార్యాలయం శంకుస్థాపనకు వెళ్లారు. అక్కడ మేధావులతో సమావేశం జరిపారు. ఆ తర్వాత సంవత్సరానికి మళ్లీ అనంతపురం వెళ్లారు. ఈ సారి పోటీ గురించి మాట్లాడారు కానీ.. అనంతపురం అని కాకుండా.. ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది ఫిబ్రవరిలో చెబుతానన్నారు.
ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయంలో పవన్ కల్యాణ్ చాలా డైలమాలో ఉన్నారు. తన పోరాటయాత్రకు జనం ఎక్కడ ఎక్కువ వచ్చారు అనిపిస్తే.. అక్కడ్నుంచి పోటీ చేస్తాననడం పరిపాటిగా మారింది. మొదట్లో ఇచ్చాపురం నుంచి పోరాటయాత్ర ప్రారంభించారు. అక్కడ్నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత ఆ జాబితా అలా పెరుగుతూ పోయింది. పాయకరావు పేట లాంటి ఎస్సీ రిజర్వుడు స్థానంలో… పాడేరు లాంటి ఎస్టీ రిజర్వుడ్ స్థానంలోనూ పవన్ కల్యాణ్ ఈ పోటీ మాటలు చెప్పి.. అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఆ తర్వాత పిఠాపురం నియోజకవర్గంలోనూ…అక్కడి శ్రీపాద వల్లభుని ఆశీస్సులంటే.. అక్కడి నుంచి పోటీ చేస్తానమో అనే .. సందేహాన్ని సైతం వ్యక్తం చేశారు. ఇప్పుడు అనంతపురంలో ఉన్నారు కాబట్టి… పోటీ గురించి గతంలో చెప్పి ఉన్నారు కాబట్టి.. కమిట్ అవకుండా .. ఫిబ్రవరిలో చెబుతానని ప్రకటించుకున్నారు.
ఇప్పుడే ఏముంది.. పవన్ కల్యాణ్ కడప జిల్లా పోరాటయాత్రకు వెళ్తారు. అక్కడకు వెళ్లిన తర్వాత పులివెందులకు వెళ్లకుండా ఉండరు. ఇప్పటికే జగన్ ను టార్గెట్ చేస్తున్న ఆవేశంలో.. అక్కడ తాను పులివెందులలో పోటీ చేస్తానని ప్రకటించినా ఆశ్చర్యం లేదనేది.. ఆయన .. ప్రకటనల్ని గమనిస్తూ వస్తున్న వారు అంటున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్.. గందరగోళానికి గురి కాకుండా.. ఓ నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ముందుకెళ్తే బాగుంటుందని జనసైనికుల అభిప్రాయం కూడా. ఎక్కడికి వెళ్తే అక్కడ్నుంచి పోటీ చేస్తామని చెప్పడం ద్వారా.. వ్యవహారం మొత్తం కామెడీ అయిపోతోందనేది వారి ఆవేదన.