ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల మంది వేలు ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకుని.. పుస్తకాలు కొని.. రేయింబవళ్లు కష్టపడిన వారు.. అన్యాయమైపోయారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షలో… కొంత మందిని ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్న వారికే ఉద్యోగాలు దక్కుతున్నాయి. పేపర్ లీకయిందనడానికి స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం… చేయాలనుకున్నదే చేస్తామంటోంది. ప్రక్రియ కొనసాగిస్తోంది. దీంతో.. తమకు ఉద్యోగం ఖాయమనుకున్న వారు.. నిరాశలో ఉండిపోయారు. ఉద్యోగాలు పొందిన వారు… వారి బ్యాక్ గ్రౌండ్ చూసి.. పరీక్ష రాసిన వారిలో.. ఓ ఆవేశం ఎగసి పడుతోంది.
మాటల్లోనే పారదర్శకత.. చేతల్లో ఏది ..?
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అవినీతి అనేదే ఉండదని.. అత్యంత పారదర్శకంగా తమ పాలన ఉంటుందని చెప్పుకొస్తున్నారు. మిగతా విషయాల సంగతేమో కానీ… ఉద్యోగ పరీక్షల విషయంలో మాత్రం.. అత్యంత అవినీతి … అసలు పారదర్శకతే లేదని.. ఉద్యోగార్థులు మండి పడుతున్నారు. జనరల్ కేటగిరిలో.. ఒక్క సామాజికవర్గానికే.. సగానికిపైగా ఉద్యోగాలు రావడం అనేది.. గతంలో ఎపపుడూ జరిగి ఉండదు. ఇది ఎలా సాధ్యమయిందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నా.. సమాధానం చెప్పే తీరక ప్రభుత్వానికి లేదు. పరీక్షల నిర్వహణకు ఫెసిలిటేటర్గా పని చేసిన… ఏపీపీఎస్సీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు… ప్రధానమైన ర్యాంకులు ఎలా వచ్చాయో.. ప్రభుత్వం వివరించలేకపోతోంది.
సివిల్స్ రేంజ్ పేపర్లో… వారికే అన్ని మార్కులు ఎలా..?
ఉద్యోగ పరీక్ష పేపర్ అత్యంత కఠినంగా ఉందనేది అందరి ఏకాభిప్రాయం. సివిల్స్ కొట్టగల ఆశలు ఉన్న వారికి కూడా.. 90 వరకూ సాధిస్తే గొప్పని విశ్లేషణలు వచ్చాయి. కష్టపడిన రాసిన వాళ్లకి అలాగే వచ్చాయి. కానీ టాపర్లకు మాత్రం… 115 మార్కుల వరకూ వచ్చాయి. ఈ టాపర్ల రికార్డులు చూస్తే.. గతంలో.. పోటీ పరీక్షలు రాసినా.. కనీసం.. క్వాలిఫయింగ్ మార్క్ అందుకోని వారే ఎక్కువ. జి. అనితమ్మ అనే టాపర్ అయితే.. ఎన్నో పోటీ పరీక్షలు రాశారు కానీ… ఆమె బెంచ్ మార్క్… ఉద్యోగానికి ఎక్కడో ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం… టాపర్ అయిపోయారు. ఈమె ఎపీపీఎస్సీలో కాంట్రాక్ట్ ఉద్యోగి. ఇక ఒకే సమాజికవర్గం.. ఒకే ఇంట్లోని వారికి ఉద్యోగాల వరద పారింది. ఇదెలా సాధ్యమయిందో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ఉద్యోగార్థుల్లో అసహనం పెరిగిపోతే ప్రభుత్వం తట్టుకోలేదు..!
కష్టపడితే ఉద్యోగం వస్తుందని 20 లక్షల మంది పరీక్షలు రాశారు. అందరినీ మోసం చేసేలా వ్యవస్థ తిరగబడిందనే ఆక్రోశం వారిలో కనిపిస్తోంది. రాజకీయ పార్టీలన్నీ.. ఉద్యోగార్థుల అనుమానాలు తీర్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన అధినేతలు.. ఇదే విషయంపై స్పష్టమైన ప్రకటనలు చేశారు. పేపర్ లీకేజీపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పాదరర్శకత మాటల్లో కాదని.. చేతల్లో ఉండాలంటున్నారు. లేకపోతే.. జనసేన తరపున పోరాట కార్యచరణ ప్రకటించే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం ఈ అంశంపై స్పందిస్తుందా..? తమ వాళ్లకే ఉద్యోగాలొచ్చాయి కాబట్టి.. వెనక్కి తగ్గేది లేదని… ముందుకే వెళ్తుందా..? అనేది కీలకం. యువతలో అసహనం వస్తే.. ఏ ప్రభుత్వమూ తట్టుకోలేదు.