తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పవన్ కళ్యాణ్ భేటీపై రకరకాల వ్యాఖ్యలు రావడంలో ఆశ్చర్యం లేదు. ఒక్క ఎన్టీఆర్‌ను మినహాయిస్తే తొలి కథా రాజకీయ హీరో ఎంజిఆర్‌తో సహా అందరూ అభిమానాన్ని ఆకర్షణగా చేసుకుని అధికారం కోసం ప్రయత్నించిన వారే. ఆ తర్వాత గెలిచినా ఓడినా రాజీపడిన వారే. ఎంజిఆర్ జీవితంలో ఎప్పుడూ కేంద్రంతో ఘర్షణ పడిన ఉదాహరణే లేదు. ఇందిరాగాంధీ తన ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత కూడా మళ్లీ గెలిచిన ఆయన ఆ పార్టీతో బాగానే వున్నారు. చిరంజీవి సరే ఓడిపోయిన కొన్ని మాసాలకే కాంగ్రెస్లోచేరిపోయారు. విజయకాంత్ ప్రతిపక్షంగా వున్నా జయలలితతో కలిసే గెలిచారు. వీరందరిలోనూ అమితాబ్ బచన్ కథ మరో రకం. కాంగ్రెస్ ఎంపిగా ఎన్నికై బోఫోర్స్ ఆరోపణల తర్వాత వైదొలగిన అమితాబ్ ఆ తర్వాత కేంద్రంలో యుపిలో ఎవరు వున్నా మంచిగావుండటంఅలవాటు చేసుకున్నారు. గుజరాత్ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు.ప్రధాని మోడీని కూడా చాలా సార్లు పొగిడారు. యుపిలో సమాజ్‌వాది తరపున భార్య జయను రాజ్యసభకు పంపించి కూడా బిజెపి నేతలతో మంచిగా వుండటం ఆయనకే చెల్లింది. నటుడుగా అందరితో మంచిగా వుంటూ పనులు జరిపించుకోవడం ఆయన మార్గంగా అగుపిస్తుంది. ఇప్పుడు రజనీ కాంత్ కూడా మౌలికంగా కేంద్రంతో ఘర్షణ పడే పరిస్థితి కనిపించడం లేదు. మోడీపట్ల అనుకూలతే వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే 2014లో ఆయన మోడీకి ,చంద్రబాబుకు అనుకూలంగా ప్రచారం చేసి విజయానికి దోహదం చేశారు. అయితే తర్వాత ఎప్పుడూ మోడీని కలుసుకున్నది లేదు.ఎపికి సంబంధించిన అంశాల్లో కేంద్రాన్ని విమర్శించారు కూడా. ఆ విధంగా తన వైఖరి రజనీకి భిన్నంగా వుంది. అయితే చంద్రబాబు విషయంలో మాత్రం విమర్శలు చేస్తూనే చివరకు అనుకూలంగా వుండిపోతున్నారనే ఆరోపణ వుంది. తాజాగా కెసిఆర్‌ను కూడాఅడిగిమరీ కలిసి ప్రశంసలు కురిపించడంతో ఉభయ చంద్రులకూ అనుకూలంగా వుంటున్నారనేందుకు అవకాశం కలిగింది. పైగా కెసిఆర్ చేస్తున్న మంచి పనులను ప్రధాని దృష్టికి తీసుకెళతానన్నారట. అంటే ఇప్పుడు ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులకూ పైన బిజెపి ప్రధానికి అనుకూలంగా వుంటే ఇక పవన్ ఎవరిపై పోరాడబోతున్నారు? కొన్ని సీట్లు తెచ్చుకున్నా అమితాబ్లాగే వారందరికీ లాబీయిస్టు అనిపించుకుంటారా? చూడాల్సిందే.